విశాఖలో కార్మిక గర్జనకు సన్నాహాలు
విజయనగరం గంటస్తంభం: డిసెంబర్ 31నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరగనున్న సీఐటీయూ జాతీయ మహాసభలను కార్మికులంతా విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు రెడ్డి శంకరరావు, ఎ.జగన్మోహనరావులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మహాసభల ప్రచారంలో భాగంగా సోమవారం స్థానిక కోట జంక్షన్ ఆటోస్టాండ్ వద్ద సీఐటీయూ జెండాను రెడ్డి శంకరరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా కార్మిక హక్కులు, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం సీఐటీయూ సాగించిన పోరాటాలకు గొప్ప చరిత్ర ఉందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కార్మిక కోడ్‌ల పేరుతో కార్మికులు సాధించుకున్న హక్కులను కుదిస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే జాతీయ మహాసభల్లో కార్మిక చట్టాల పరిరక్షణ, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకత, అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం తీసుకురావాలనే అంశాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. జనవరి 4న విశాఖపట్నం బీచ్‌లో జరిగే బహిరంగ సభలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బి.రమణ, పాపారావులతో పాటు ఆటో, కలాసీ కార్మికులు పాల్గొన్నారు.


