రంగస్ధల కళాకారులకు జెడ్పీ చైర్మన్ ప్రశంసలు
విజయనగరం టౌన్: రంగస్ధల రారాజు ఆచంట వెంకటరత్నం నాయుడు దశమ వర్ధంతిని పురస్కరించుకుని ఆచంట ఆర్ట్స్ అకాడమీ, రావి నాంచారయ్య ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో గుంటూరులో దుర్యోధన మయసభ ఏకపాత్రాభినయ పోటీలలో జిల్లాకు చెందిన మండా రమేష్ పాల్గొని ప్రథమ విజేతగా నిలిచారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమెంటోను మంగళవారం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కళాకారుడిని అభినందించారు. అనంతరం డిసెంబరు 9న జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. విజయనగరం కళాకారులకు పుట్టినిల్లు వంటిదని, అటువంటి కళాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో విశాఖ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు, నంది అవార్డు గ్రహీత వంకాయల మారుతీప్రసాద్, కంది త్రినాథ్, కందుల గున్నేశ్వరరావు, జీపీ రాజు, రెడ్డి తిరుపతిరావు, మండా రమేష్, రామారావు తదితరులు పాల్గొన్నారు.


