ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు
విజయనగరం అర్బన్: ప్రీ ఆడిట్, ఆడిట్ ప్రక్రియల్లో ఫిర్యాదుదారుల సంతృప్తి స్థాయి పెరగాల్సిన అవసరం ఉందని, ఫిర్యాదు పరిష్కారంలో అలసత్వం చూపే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ వినతుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పీజీఆర్‌ఎస్‌కు సంబంధించిన సమావేశాలకు ఆడిట్ అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి మ్యుటేషన్లపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో మండల ప్రత్యేకాధికారులు ప్రత్యేకశ్రద్ధ వహించాలని సూచించారు. మ్యుటేషన్ల దరఖాస్తుల పరిశీలన, తిరస్కరణ అంశాలపై నేరుగా విచారణ జరపాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, ప్రత్యేక ఉపకలెక్టర్ మురళీ సహా పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇది అనధికార లే అవుట్
చీపురుపల్లి: ‘ఇది అనధికార లే అవుట్.. ఈ లే అవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవు.. క్రయ విక్రయాలకు గ్రామ పంచాయతీ ఎలాంటి బాధ్యత వహించదు.. ఇక్కడ ప్లాట్లు కొన్న వారికి ఇంటి ప్లాన్లు ఆమోదించబడవు.. తాగునీటి సదుపాయం అనుమతించబడదు’.. ఇదీ రావివలస రెవెన్యూ పరిధిలో వెలసిన అనధికార రియల్ ఎస్టేట్ వెంచర్‌లో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డు. రావివలస రెవెన్యూ పరిధిలో ఏర్పాటైన అనధికార లే అవుట్‌పై ‘దర్జాగా రియల్ దందా’ అనే శీర్షికన గతనెల 30న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. అదేరోజు ఎంపీడీఓ సురేష్ ఆధ్వర్యంలో సిబ్బంది రియల్ ఎస్టేట్ వెంచర్‌ను పరిశీలించి నోటీసులు జారీచేశారు. పంచాయతీ కార్యదర్శి కె.సతీష్, వీఆర్వో ఏ.జగన్నాథం నేతృత్వంలో అనధికార లే అవుట్‌లో సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబర్ 164/11,12,13,14,15, 165/1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 166/1, 2, 3పి, 4పి నంబర్లల్లో ఏర్పాటు చేసిన లే అవుట్‌కు ఎలాంటి అనుమతులు లేవని హెచ్చరిక బోర్డులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా లేఅవుట్లు వేసి విక్రయాలు జరిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
● హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు
● ఇంటి ప్లాన్లు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయం
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు


