మహిళ ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?
● మంత్రి సంధ్యారాణి తీరుపై ధ్వజమెత్తిన
మాజీ ఎమ్మెల్యే కళావతి
వీరఘట్టం: ఒక మహిళా మంత్రి అయి ఉండి, మరో మహిళకు రక్షణ కల్పించడంలో వివక్ష చూపించారు.. ఉద్యోగిని అయిన ఒంటరి మహిళ రక్షణ కోరి వస్తే ఆదుకోకపోగా.. ఆమైపె దురుసుగా విరుచుకుపడి, ఆమెను వేధింపులకు గురి చేశారు.. ఒంటరి మహిళకు అండగా ఉండి ఆమె గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన మీడియాపై మంత్రి సంధ్యారాణి కక్ష సాధింపు చర్యలు చేపట్టడం సమంజసం కాదని మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి అన్నారు. వండువలో ఆమె విలేకర్లతో సోమవారం మాట్లాడారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఓ మహిళకు ఉద్యోగం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఆమె నుంచి డబ్బులు కాజేసిన మంత్రి పీఏపై చర్యలు తీసుకోకుండా, తప్పుచేసిన వారిని వదిలేసి, ఆ తప్పును వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై కేసులు పెట్టి భయపెడుతుండడం రెడ్‌బుక్ రాజ్యాంగానికి పరాకాష్టగా పేర్కొన్నారు. ఒక గిరిజన మంత్రి అయి ఉండి, గిరిజనుల సంక్షేమాన్ని ఏనాడైనా పట్టించుకున్నారా అని మంత్రి సంధ్యారాణిని ప్రశ్నించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన విద్యార్థుల అకాల మరణాలపై ఎందుకు మంత్రి స్పందించడం లేదని ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలను ఎందుకు ఆర్థికంగా ఆదుకోలేకపోయారో చెప్పాలన్నారు. మహిళోద్ధరణకు కట్టుబడి ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం మంత్రి కుమారుడి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఓ ఆడబిడ్డ అవమానాలను భరించి, అన్ని ఆధారాలతో ఫిర్యాదుచేసినా నిందితులను ఎందుకు అరెస్టుచేయలేదన్నారు. తక్షణమే బాధిత మహిళకు మంత్రి సంధ్యారాణి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


