ఎయిర్‌పోర్ట్‌కు వసతులు కల్పించండి
● కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసందర్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. విమానాశ్రయానికి రోడ్లు, కాలువలు, విద్యుత్, నీటి సరఫరా, భూసేకరణ తదితర అంశాలపై తన చాంబర్‌లో అధికారులతో సోమవారం సమీక్షించారు. ఎయిర్‌పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20 కోట్లతో చేపట్టిన పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యుత్‌లైన్ ఏర్పాటుపై సంబంధిత అధికారులను ప్రశ్నించారు. విద్యుత్‌లైన్ కోసం రూ.85 లక్షల ఖర్చవుతుందని, సుమారు 15 కిలోమీటర్లమేర లైన్ వేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. ఎయిర్‌పోర్ట్‌ను వర్షపు నీరు ముంచెత్తకుండా సుమారు రూ.27కోట్ల వ్యయంతో 25 కిలోమీటర్ల మేర నాలుగు కెనాల్స్ తవ్వాల్సి ఉందని, దీనికోసం వెంటనే అంచనాలు సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. సవరవిల్లి–తూడెం గ్రామాల మధ్య 2.3 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సీసీ రోడ్డు పనుల అంచనాలు అత్యవసరంగా సిద్ధం చేయాలన్నారు. విమానాశ్రయ స్టాఫ్ కార్వర్టర్స్, ఇతర అవసరాల కోసం జరగాల్సిన భూసేకరణపై సమగ్రంగా చర్చించారు. సమావేశంలో జేసీ ఎస్.సేతుమాధవన్, ఆర్డీఓ డి.కీర్తి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కవిత, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, మైనర్ ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


