వేతనదారులపై వేటు..!
జిల్లాలో వేలాది మంది వేతనదారుల
తొలగింపు
జిల్లాలో వేతనదారులు 5,42,057 మంది
ఈకేవైసీ పూర్తయిన వారు
4,73,988 మంది
మిగతా 68,069 మంది వేతనదారులను తొలగిస్తున్నట్టు ఆరోపణలు
తొలగిస్తున్నాం..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదలకు ఒక వరం. అలాంటి పథకం అమలుపై చంద్రబాబు ప్రభుత్వం కొత్త కుట్రలకు తెర తీస్తోంది. పేదల ఉపాధి కొట్టేందుకు చర్యలకు ఉపక్రమించింది. దీనికి ఈకేవైసీ అస్త్రాన్ని తెర మీదకు తెచ్చింది. ఈకేవైసీ చేయించుకోని వారిని వేతనదారుల జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో తాత్కాలికంగా దూర ప్రాంతాలకు వెళ్లిన వేతనదారుల పరిస్థితి ఏమిటన్న దానిపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ చర్యలు ఏ మాత్రం సరికాదని వేతనదారులు మండిపడుతున్నారు.
విజయనగరం ఫోర్ట్:
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారుల ఉపాధిపై చంద్రబాబు సర్కార్ దెబ్బకొడుతుందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈకేవైసీ చేయించుకోవడానికి రాలేదనే నెపంతో వేతనదారులను జాబ్ కార్డు నుంచి తొలగిస్తున్నారు. వేలాది మంది వేతనదారులను ఇప్పటికే తొలిగించినట్టు అధికారుల మాటలు అర్ధం చెబుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా వేతనదారులకు పని కల్పించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయింది. దీనికి తోడు ఇప్పు డు వేతనదారులను పనికి దూరం చేయనుండడంతో మరింత మందికి ఉపాధి లేకుండా పోతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని చంద్రబా బు ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే ప్రతి పని సర్కార్‌కు భారంగా మారిందనే నెపంతో ఆర్థికపరమైన భారాలను తగ్గించే కుట్రలు పన్నుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వలసల నివారణకే ఉపాధి
ఉపాధి హామీ పథకం రాక ముందు జిల్లా వాసులు వేల సంఖ్యలో ఉపాధి కోసం హైదరాబాద్, చైన్నై, విజయవాడ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్లేవారు. అదే విధంగా పొరుగు జిల్లా అయిన విశాఖపట్నం కూడా ఎక్కువగా వలస వెళ్లేవారు. నెలలు, సంవత్సరాలు తరబడి కూలీ, నాలీ చేసుకుని అక్కడే ఉండేవారు. ఉపాధి హామీ పథకం చేపట్టిన తర్వాత కొంతవరకు వలసలు తగ్గాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వ వైఖరి వల్ల మళ్లీ వలస వెళ్లే పరిస్థితులు నెలకొన్నాయి.
ఉపాధి వేతనంతో జీవనం
జిల్లాలో అధిక శాతం మంది వేతనదారులు నిరుపే దలే. గ్రామాల్లో నిర్వహించే ఉపాధి పనులకు వెళ్లి వాటి ద్వారా వచ్చే వేతనంతో జీవిస్తారు. ఇటువంటి వారు ఉపాధి పనులు లేని సమయంలో కూలీ పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అటువంటి వారు వలస వెళ్లారని తొలిగిస్తే వారి పరిస్థితి ఏమిటన్నది ప్రభుత్వం ఆలోచించకుండా వారిని తొలగించే చర్యలు చేపట్టడం పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏడాదిలో కొన్ని నెలలు ఉపాధి పను లు లేనప్పుడు పేదలు పక్క జిల్లాలతో పాటు దూర ప్రాంతాలకు వెళ్లి జీవన విధానాన్ని వెతుక్కుంటున్నారు. మళ్లీ ఉపాధి దొరుకుతుందన్న సమయంలో సొంత గ్రామాలకు వచ్చి పనులు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇప్పుడే ఈకేవైసీ చేయించుకోవాలని సూచిస్తూ లేకుంటే తొలగింపు తప్పని చర్యలు చేపడుతూ వారి ఉపాధికి గండి కొట్టే చర్యలకు ఉపక్రమించింది. ఇది కాస్త పేదల జీవనంపై దెబ్బ తీస్తుంది. అలాంటప్పుడు శాశ్వత ఉపాధి కల్పించే చర్యల కు చంద్రబాబు సర్కార్ చర్యలు తీసుకోవాలని వా రు కోరుతున్నారు. అంతేగాని ఇలా డొంకతిరుగుడు పద్ధతిలో తమ జాబ్ కార్డులను తొలగించే చర్యలు ఎంత వరకు సమంసజమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో వేతనదారులు 5,42,057 మంది ఉన్నారు. వీరిలో 4,73,988 మందికి ఉపాధి సిబ్బంది ఈకేవైసీ చేశారు. 68,069 మంది వేతనదారులు ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు. ఇప్పడు వీరందని తొలగిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి పనులు గిట్టుబాటు కాకపోవడం, పూర్తి స్థాయిలో పనులు కల్పించక పోవడం తదితర కారణాల వల్ల కొంతమంది వేతనదారులు తాత్కలికంగా ఇతర పనులకు వలస వెళ్తున్నారు. అటువంటి వారిని కూడా తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విమర్శలు లేకపోలేదు.
ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారు లు 4,73,988 మందికి ఇప్పటికే ఈకేవైసీ చేయ డం జరిగింది. ఇంకా 68,069 మంది ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది. కానీ వారంతా రాలే దు. ఈ పరిస్థితుల్లో గ్రామాల నుంచి శాశ్వతంగా వలస వెళ్లిన వారిని తొలగిస్తున్నాం. అదే విధంగా మరణించిన వేతనదారులను, డూప్లికెట్, రెండుసార్లు పేర్లు నమోదైన వారి పేర్లను తొలగిస్తున్నాం. తాత్కలికంగా వలస వెళ్లిన వారు ఎప్పుడొచ్చినా ఈకేవైసీ చేస్తాం.
– ఎస్.శారదాదేవి, డ్వామా పీడీ
వేతనదారులపై వేటు..!


