త్వరలో అసెంబ్లీ ముట్టడి
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకుంటే పోరాటం ఉధృతం ● ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి ● ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి నాగభూషణ్
విజయనగరం: ప్రజలు, విద్యార్థులు ఎదుర్కొంటు న్న సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణీత వ్యవధిలో స్పందించి పరిష్కరించకుంటే త్వరలో అసెంబ్లీని ముట్టడిస్తామని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి దాసరి నాగభూషణ్ హెచ్చరించారు. ఆదివారం నగరంలోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల దగ్గరి కి యువగళం పాదయాత్ర ద్వారా వచ్చి జీవో నెంబర్ 77ను రద్దు చేస్తామన్నారని, ఫీజురీయింబర్స్‌మెంట్ అమలు చేస్తామని మోసం చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక యూనివర్సిటీలకు నిధులు తెస్తామంటూ చేసిన ప్రకటన అమలుకు నోచుకోలేదని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను తక్షణమే ఉపసంహరించుకోకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన మార్చుకోకపోతే విద్యార్థి ఉద్యమం గుణపాఠం నేర్పిస్తుందని, భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున ప్రజాస్వామిక శక్తులతో కలిసి పోరాటం నిర్మిస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సుమన్, సహాయ కార్యదర్శి గౌరీ శంకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.


