స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం
● మెట్టపల్లిలో వ్యాధి లక్షణాలతో మహిళ మృతి
● వారం రోజులు ఆస్పత్రిలో చికిత్స
● ఆందోళన చెందుతున్న స్థానికులు
చీపురుపల్లి: స్క్రబ్ టైఫస్ వైరస్ కలకలం రేపుతోంది. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ ఇప్పుడు చీపురుపల్లి ప్రాంతానికి సోకినట్టు చర్చ జరుగుతోంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. స్క్రబ్ టైఫస్ వైరస్ వ్యాధి లక్షణాలతో మండలంలోని మెట్టపల్లి గ్రామంలో చందక రాజేశ్వరి(39) మృతి చెందినట్టు సాక్షాత్తూ భర్త సూర్యనారాయణ చెబుతుండడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించి మృతురాలు రాజేశ్వరి భర్త సూర్యనారాయణ అందించిన వివరాల్లోకి వెళ్తే.. మెట్టపల్లి గ్రామానికి చెందిన చందక రాజేశ్వరికి వారం రోజులు కిత్రం మెడపై ఓ పురుగు కుట్టుంది. దీంతో మెడంతా దద్దుర్లుగా ఏర్పడి తీవ్ర స్థాయిలో జ్వరం వచ్చింది. దీంతో చీపురుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. తరువాత ఇంటికి వెళ్లగా వాంతులు, ఆయాసం ప్రారంభమైంది. దీంతో విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ రెండు రోజులు చికిత్స అందించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో గుండె కొట్టుకోవడం తగ్గిపోయింది. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి మరణించింది. అక్కడి వైద్యులు సైతం స్క్రబ్ టైఫస్ వైరస్ లక్షణాలు ఉన్నాయని చెప్పినట్టు సూర్యనారాయణ చెబుతున్నాడు. గుడ్లు వ్యాపారం చేసుకునే సూర్యనారాయణకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అకస్మాత్తుగా భార్య మరణించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.


