కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యం
విజయనగరం ఫోర్ట్: కుష్టు వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా వైద్యసిబ్బంది పనిచేయాలని డీఎంహెచ్‌ఓ ఎస్. జీవనరాణి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద శనివారం కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించే ఆటో ప్రచార రథాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 30వ తేదీవరకు కుష్టు వ్యాధిని గర్తించే కార్యక్రమం తలపెడతామన్నారు. ప్రజలందరూ ఆరోగ్య సిబ్బందికి సహకరించి తనిఖీలు చేయించుకోవాలన్నారు. స్పర్శ, నొప్పి లేని మచ్చలు కుష్టువ్యాధి లక్షణాలుగా అనుమానించాలన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఓ డాక్టర్ రాణి పాల్గొన్నారు.
పరిశుభ్రతపై అవగాహన కల్పించండి
విజయనగరం: పరిశుభ్రతపై విద్యార్థులే వారి కుటుంబ సభ్యులకు అవగాహన కలిగించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రలో భాగంగా బాబామెట్టలో బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత–సామాజిక పరిశుభ్రతపై శనివారం అవగాహన కల్పించారు. వ్యక్తి శుభ్రంగా ఉంటే కుటుంబం, సమాజం పరిశుభ్రంగా ఉంటాయన్నారు. చెత్త నిర్వహణపై ప్రతీ ఒక్కరికీ అవగాహన అవసరమని, వీధులు పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖాధికారి మాణిక్యంనాయుడు, ఎంఈఓ సత్యవతి, కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కొండపల్లి సాంబమూర్తి, స్థానిక కార్పొరేటర్ గాదం మురళి తదితరులు పాల్గొన్నారు.
డైట్ విద్యార్థులకు ‘పరీక్ష’
● బేస్‌లైన్ టెస్ట్‌ల విధులతో 10 రోజులు వృథా
● ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 206 క్లస్టర్లకు 237 మంది డైట్
విద్యార్థులకు విధులు
● అధికారుల నిశ్శబ్దం... విద్యార్థుల్లో అసంతృప్తి
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డైట్ కళాశాలలకు చెంది 237 మంది డైట్ విద్యార్థుల చదువుకు బేస్‌లైన్ టెస్టు విధులు అవరోధంగా మారాయి. సోమవారం నుంచి ప్రారంభంకానున్న 1, 2 తరగతుల బేస్‌లైన్ టెస్టుల నిర్వహణ బాధ్యతలను వీరిపై రుద్దడంతో దాదాపు 10 రోజులపాటు వారి అకడమిక్ కార్యక్రమాలు స్తంభించనున్నాయి. దీనిపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. డైట్ కళాశాలలో శనివారం జరిగిన ట్యాగింగ్ ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని 206 క్లస్టర్ల బాధ్యతలను డైట్ విద్యార్థులకు అప్పగించారు. ఒక్కో క్లస్టర్‌లో 12 నుంచి 20 ప్రాథమిక పాఠశాలలు ఉండగా స్థానిక సీఆర్‌పీ సహకారంతో బేస్‌లైన్ టెస్ట్‌లు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 రోజులు సాగడంతో చదువులకు ఆటంకం కలుగుతుందని విద్యార్థులు వాపోతున్నారు. ‘మా చదువుకు సంబంధం లేని పనులతో సమయం వృథా చేయడం సరికాదు. ఇప్పటికే డైట్ కోర్సు సిలబస్ భారీగా ఉంది. ఈ పది రోజులు మా అధ్యయనం పూర్తిగా దెబ్బతింటుంది’ అని ఓ డైట్ విద్యార్థి విలేకరుల ముందు వాపోయాడు. మరో విద్యార్థి మాట్లాడుతూ ప్రస్తుత సెమిస్టర్‌కు 90 రోజుల పాఠాలు చెబితేనే సిలబస్ పూర్తవుతుందని, ఈ విధుల వల్ల పది రోజుల కాలం వృథా అయి సిలబస్ పూర్తి కాని పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొన్నాడు. మరోవైపు పాఠశాలలకు వెళ్లేందుకు దారిఖర్చులు భరించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయని వాపోయారు. అధికారులు మౌనంగా ఉండి డైట్ విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చవద్దని విద్యావేత్తలు, మేధావులు కోరుతున్నారు.


