వియ్యంపేటలో వార్డుమెంబర్ హత్య
● బంగారం కోసమే హత్య చేశారా? లేదా ఇతర కారణాలు ఉన్నాయా? ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కొత్తవలస: మండలంలోని వియ్యంపేట గ్రామం ఒక్కసారి ఉలిక్కిపడింది. శనివారం తెల్లవారుజూమున గ్రామానికి చెందిన పంచాయతీ నాల్గువ వార్డు మెంబర్ దూది రాము(59) హత్యకు గురైందన్న వార్త గ్రామస్తుల్లో కలకలం రేపింది. బంగారం కోసమే దుండగులు హత్యచేశారా? లేదంటే ఏమైనా రాజకీయ కక్ష ఉందా? అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించి గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతురాలు రాముకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహాలు కావడంతో అత్తవారి ఇళ్లలో ఉంటున్నారు. కొడుకు గౌరీశంకర్ గంట్యాడ మండలం ప్రాంతంలోని లేఅవుట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. రాము ఒక్కరే ఇంటి వద్ద ఆవును మేపుకుంటూ జీవం సాగిస్తోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి ఎప్పటిలాగే భోజనం చేసి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారు జామున దుండగులు ఇంట్లోకి ప్రవేశించి మెఖం, తలపై బలంగా కొట్టి తలగడతో ఊపిరి ఆడకుండా చేసి హత్యచేసినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తెల్లవారుజూమున ఆమె ఎంతకీ ఇంట్లోనుంచి బయటకు రాకపోవడంతో ఎదురింటి మహిళ వెళ్లి చూసింది. నేలపై విగత జీవిగా పడిఉన్న రామును చూసి ఇరుగుపొరుగు వారికి తెలియజేయడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సీహెచ్ షణ్ముఖరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె వంటిపై ఉన్న బంగారు వస్తువులు పెనుగులాట సమయంలో పక్కనే పడిపోయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపైన, ఇంట్లో సుమారు 4 తులాల బంగారం, కొంత నగదు అక్కడే ఉంది. మృతురాలి చెవులకు ఉన్న బంగారు దిద్దులు, కీప్యాడ్ సెల్‌ఫ్‌న్‌ను మాత్రమే దుండగలు పట్టుకుపోయినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్య ఉదంతంలో ఇద్దరు, అంతకన్న ఎక్కువ మంది పాల్గొన్నట్టు అనుమానిస్తున్నారు. హత్యవెనుక ఏమైనా రాజకీయ కక్ష ఉందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. విజయనగరం నుంచి ప్రత్యేక క్లూస్‌టీమ్ బృందం వచ్చి వేలిముద్రలను సేకరించింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు.
వియ్యంపేటలో వార్డుమెంబర్ హత్య


