జ్వరాల పేరిట దోపిడీ..!
విజయనగరం ఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన దేముడు అనే వ్యక్తి జ్వరం వచ్చిందని విజయనగరంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ వైద్య పరీక్షలు చేయగా ప్లేట్‌లెట్స్ తగ్గాయని చెప్పి ఆస్పత్రిలో ఇన్‌పేషేంట్‌గా చేర్చుకున్నారు. మూడు రోజులు పాటు చికిత్స అందించి రూ.20 వేలు బిల్లు వేశారు. అలాగే విజయనగరం మండలానికి చెందిన వెంకటరావు అనే వ్యక్తికి జ్వరం రావడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వారం రోజుల పాటు చికిత్స తీసుకోగా.. ఆస్పత్రి సిబ్బంది రూ. 50 వేలు వసూలు చేశారు. ఈ పరిస్థితి ఈ ఇద్దరిదే కాదు. నిత్యం అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి. జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వెళితే చాలు వారి జేబు గుళ్లయ్యే పరిస్థితి నెలకొంటోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకాలంలో వైద్య సేవలు అందుతాయో లేదోననే అనుమానంతో చాలా మంది ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. సాధారణ జ్వరానికి కూడా వైద్య పరీక్షలు, స్కానింగ్‌ల పేరిట అధిక మొత్తంలో దోచేస్తున్నారు. దీంతో జ్వరం బారిన పడినవారు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజారోగ్యానికి కోట్లాది రుపాయలు ఖర్చు చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటుందే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫీజులపై స్పష్టత కరువు..
ఏ చికిత్సకు ఎంత తీసుకోవాలన్న దానిపై స్పష్టత లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా తమకేమీ పట్టనట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రక్త పరీక్షలకు.. డెంగీ, మలేరియా, నిమోనియా, వెంటిలేటర్ చికిత్స, ఐసీయూ చికిత్స, పాముకాటు చికిత్స, గైనిక్, జనరల్, న్యూరో సర్జరీలు, పక్షవాతం చికిత్స, యూరాలజీ, పలమనాలజీ, నెఫ్రాలజీ, తదితర చికిత్సలకు ఎంత ఫీజు వసూలు చేయాలన్న దానిపై స్పష్టత లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల వారు తమకు నచ్చిన విధంగా డబ్బులు వసూలు చేస్తూ రోగులను దోచుకుంటున్నారు. జిల్లాలో 300 వరకు ప్రైవేటఆస్పత్రులు, క్లినిక్‌లు, ల్యాబ్‌లు, స్కానింగ్ సెంటర్లున్నాయి. అధిక శాతం ఆస్పత్రుల్లో ఫీజుల వివరాలు తెలియజేసే బోర్డుల్లేవు.
సాధారణ జ్వరాలకు అధిక మొత్తంలో బిల్లులు
ప్లేట్‌లెట్స్ పేరిట అదనపు వసూళ్లు
ఏ చికిత్సకు ఎంత ఫీజు వసూలు
చేస్తారనే దానిపై స్పష్టత కరువు
పట్టించుకోని అధికారులు


