‘జియో’ రామకృష్ణకు స్వర్ణం
శృంగవరపుకోట: కొన్నేళ్లుగా యోగాలో సాధన చేస్తున్న ‘జియో’ వ్యవస్థాపకుడు బొబ్బిలి రామకృష్ణ యోగాలో స్వర్ణపతకం సాధించారు. విశాఖలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యోగా అసోసియేషన్ 38వ యోగాసన చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ పోటీల్లో ఎస్.కోట పట్టణానికి చెందిన యోగా శిక్షకుడు బొబ్బిలి రామకృష్ణ 50–60 విభాగంలో ఉత్తమ ప్రతిభ చాటారు. దీంతో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదాయపు పన్నుశాఖ జాయింట్ కమిషనర్ కె.ప్రసాద్ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. సబ్‌జూనియర్స్ విభాగంలో బి.హృషీకేశ్, బి.లాస్యశ్రీలు ప్రతిభ చూపారు. వారికి ఇండియన్ యోగా ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్, కార్యదర్శి మృణాల్‌చక్రవర్తి, ఏపీ యోగా అసోసియేషన్ చైర్మన్ కె.హరినాఽథ్‌రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు కోన కృష్ణదేవరాయలు, ఎ.రవికుమార్, విశాఖపట్నం యోగా అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కేఏ రాజు, సీహెచ్‌వీ రమేష్, బి.సన్యాసిరావు తదితరులు పతకాలు, ప్రశంసాపత్రాలు అందచేశారు.


