ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించాలి
● సబ్‌కలెక్టర్లకు స్పష్టం చేసిన జిల్లా ప్రత్యేకాధికారి
పార్వతీపురం రూరల్: ‘మోంథా’ తుపానును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రత్యేకాధికారి నారాయణ భరత్ గుప్తా ఆదేశించారు. జిల్లాలో ఎక్కడ, ఎంత చిన్న సమస్య తలెత్తినా తక్షణం తన దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ డా.ఎన్ ప్రభాకర రెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డిలతో కలిసి ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్ కలెక్టర్లు మంగళవారమే ముంపు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, ముందస్తు చర్యలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. తహసీల్దార్, ఎంపీడీఓ, పోలీస్ అధికారి మూడు రోజులపాటు ఒక్కచోటే ఉండి సమన్వయంతో పనిచేయాలని, రహదారులపై చెట్లు విరిగిపడితే తక్షణం తొలగించాలని, అసలు చెట్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, చెట్లు పడి విద్యుత్ తీగలు తెగాయన్న మాటే వినపడకూడదని ఆదేశించారు.
గంటగంటకూ నివేదిక
క్షేత్రస్థాయిలో ఏ చర్యలు తీసుకున్నా, ఏం జరిగినా వెంటనే గూగుల్ షీట్‌లో అప్‌లోడ్ చేయాలని, ప్రతి గంటకూ సమాచారం అందించాలని కలెక్టర్‌ను కోరారు. పంటనష్టం జరగకుండా వరి పొలాల్లోకి వచ్చిన వరద నీటిని వెంటనే వదిలేయాలని రైతులకు తెలియజేయాలన్నారు. పురాతన, శిథిల భవనాలను గుర్తించి, అక్కడ ఎవరూ ఉండకుండా చూడాలని, సిబ్బంది విధి నిర్వహణ ప్రదేశంలోనే ఉండాలని, తాగునీరు, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. సచివాలయాల్లో మహిళా పోలీసులు అందుబాటులో ఉండాలని, వసతి గృహాల్లోని విద్యార్థులను తుపాను ప్రభావం తగ్గే వరకు బయటకు రానివ్వరాదని ప్రత్యేక అధికారి సూచించారు. సమావేశంలో డీఆర్‌ఓ కె.హేమలత, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


