విద్యుత్ షాక్‌తో రైతు మృతి
వంగర: మండల పరిధి కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన రైతు పారిశర్ల వెంకటరమణ(49) సోమవారం విద్యుత్ షాక్‌తో మృతిచెందాడు. తుఫాన్ కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తన పొలంలో నిలువ నీటిని తొలగించేందుకు మడి వద్దకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామానికి చెందిన మహిళా రైతు కోల అప్పన్నమ్మ ముందు వైపు నడుస్తూ గ్రామం వైపు వస్తోంది. ఆమె వెనుక భాగంగా నడుచుకుంటూ ఇంటి వైపు వెంకటరమణ వస్తున్నాడు. ఆ సమయంలో భారీ వర్షంతోపాటు గాలులు వీయడంతో విద్యుత్ లైన్ గాలికి తెగిపడింది. అది గమనించిన ఆ మహిళా రైతు తప్పించుకుని వెళ్లిపోయింది. విద్యుత్ లైన్ తెగిపడిందని అక్కడే ఉన్న రైతు వెంకటరమణకు కేకలు వేసి చెప్పినప్పటికీ వర్షం కారణంగా గమనించలేదు. వ్యవసాయ పంపుసెట్ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్ పొలంలో తెగిపడడంతో గమనించని రైతు వెంకటరమణ కాలికి విద్యుత్ వైరు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్తులు హుటాహుటిన అక్కడకు చేరుకుని భోరున విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ పిన్నింటి రామారావు, ఎంపీడీవో రాజారావు, విద్యుత్ శాఖ ఏఈ వి.సాంబశివరావు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనను కలెక్టర్‌కు వివరించామని తహసీల్దార్ తెలిపారు. అనంతరం భార్య శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలించినట్లు ఎస్సై షేక్ శంకర్ తెలిపారు. మృతుడికి భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
విద్యుత్ షాక్‌తో రైతు మృతి


