విజయనగరం అర్బన్: మోంథా తుఫాన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తుఫాను కంట్రోల్ రూంను సందర్శించారు. తుఫాన్‌ను ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై సమీక్షించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని రకాల ముందస్తు చర్యలను తీసుకోవాలని కోరారు. పంట నష్టం జరగకుండా రైతులకు తగిన జాగ్రత్తలను తెలియపరచాలని సూచించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు. తాగునీరు,పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని మంత్రి ఆదేశించారు. తుఫాన్ వల్ల జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించకుండా తీసుకున్న చర్యలను మంత్రికి ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి వివరించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్, డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి, సీపీఓ పి.బాలాజీ, డీపీఓ రాజేశ్వరి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఐరాస సదస్సుకు ఆహ్వానం
బొబ్బిలి: డీబీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చిట్టిబాబుకు దోహాలో ఐక్యరాజ్య సమితి నిర్వహించే రెండో ప్రపంచ సామాజిక అభివృద్ధి సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ మేరకు సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ దాదాపు 3 దశాబ్దాల తరువాత సామాజిక అభివృద్ధి సదస్సును నిర్వహిస్తున్న ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు తనకు ఆహ్వాన లేఖను పంపారని తెలిపారు. నవంబర్ 4 నుంచి 6 వరకూ జరిగే ఈ సదస్సుకు తనను ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. కాగా చిట్టిబాబు గతంలోనూ జాతీయ, అంతర్జాతీయ వేదికల్లో పలు సదస్సులు, పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సామాజిక అంశాలపైన తన గళం వినిపించారు. ఆయన స్వస్థలం బొబ్బిలి మండలంలోని రంగరాయపురం.
గాయపడిన వృద్ధుడి మృతి
నెల్లిమర్ల: రోడ్డు ప్రమాదంలో గాయపడి విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న నెల్లిమర్లలోని బైరెడ్డి వీధికి చెందిన వృద్ధుడు గిడుతూరి అప్పలనారాయణ (70) సోమవారం వేకువజామున మృతిచెందాడు. ఈ నెల 19న నెల్లిమర్లలో రోడ్డు దాటుతుండగా గుర్ల మండలానికి చెందిన వ్యక్తి మోటార్ సైకిల్‌తో వస్తూ అప్పలనారాయణను ఢీ కొట్టాడు. దీంతో గాయపడిన అప్పలనారాయణను కుటుంబసభ్యులు తొలుత విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖలోని కేజీహెచ్‌లో చేర్చారు. నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
గాయపడిన కూలీ మృతి
కశింకోట: మండలంలోని బయ్యవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కూలీ మృతి చెందినట్లు సీఐ అల్లు స్వామినాయుడు సోమవారం తెలిపారు. ఆయన వివరాల ప్రకారం..బయ్యవరం వద్ద పరిశ్రమలో పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులు నడిచి వస్తుండగా, ఆదివారం సాయంత్రం యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో వారు గాయపడ్డారు. ఇద్దరిలో తీవ్రంగా గాయపడిన విజయనగరం జిల్లా మర్రివలస గ్రామానికి చెందిన పరమేష్ (52)కు అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఉన్నత చికిత్స కోసం విశాఖ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పరమేష్ బయ్యవరంలోని ఒక ప్రైవేట్ పరిశ్రమలో కూలీగా పని చేస్తున్నాడు.
తుఫాన్‌పై అధికారులతో మంత్రి సమీక్ష


