పారదర్శకమైన ఓటర్ల జాబితాకు సహకరించాలి
● డీఆర్‌ఓ కె.హేమలత
పార్వతీపురం రూరల్: జిల్లాలో నాణ్యమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పక్షాల ప్రతినిధులతో తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ఈ మేరకు మాట్లాడారు. స్పష్టమైన జాబితా తయారీకి బీఎల్‌ఓలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి నెలా మొదటి వారంలో తప్పనిసరిగా జరిగే డీఈఓ/ఈఆర్‌ఓ సమావేశాలలో పాల్గొని సూచనలు ఇవ్వాలని ఆమె పార్టీ ప్రతినిధులను కోరారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు ఏడు రోజులు దాటిన పెండింగ్ దరఖాస్తులను తక్షణమే క్లియర్ చేయాలని, కొత్త దరఖాస్తులను రోజువారీగా సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆదేశించారని డీఆర్‌ఓ గుర్తు చేశారు. ఈ ఏడాది జనవరి 6 నుంచి ఇప్పటివరకు స్వీకరించిన 6,933 దరఖాస్తులలో, 5,969 ఈ–రోల్ కాగా, కేవలం 165 మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 799 దరఖాస్తులు చట్టపరమైన కారణాలతో తిరస్కరించినట్లు వివరాలు అందించారు. సమావేశంలో వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


