పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
● 122 కొత్త కేంద్రాల ప్రతిపాదన
● డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి
విజయనగరం అర్బన్: భారత ఎన్నికల సంఘం జూన్ 16న జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 1,200కు పైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలకు అదనపు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు డీఆర్‌ఓ ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలోని ఈఆర్‌ఓలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించిన అనంతరం 23 పోలింగ్ కేంద్రాల స్థానాల మార్పు, 51 కేంద్రాల పేరు మార్పు, 122 కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటును ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రతిపాదనలను భారత ఎన్నిక సంఘానికి నివేదించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. అన్ని రాజకీయ పార్టీలు తమ గుర్తింపు పొందిన బూత్ లెవెల్ ఏజెంట్ల వివరాలను సంబంధిత నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు అందజేయాలని సూచించారు. సమావేశంలో ప్రత్యేక ఉపకలెక్టర్ ప్రమీల గాంధీ, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు, సహాయ ఎన్నికల అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


