
వైభవంగా పైడితల్లి రథయాత్ర
● జై పైడిమాంబ నినాదాలతో మార్మోగిన పట్టణం
● పైడితల్లి ఇరుముడులతో రథయాత్రలో పాల్గొన్న దీక్షధారులు
విజయనగరం టౌన్: మంగళ వాయిద్యాలు, దీక్షధారుల జైపైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయధ్వానాలు, భజనల నడుమ సిరులతల్లి రథయాత్ర బుధవారం వైభవంగా సాగింది. ముందుగా చదురుగుడిలోని ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆశీనులు చేసి అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజాధికాలు చేశారు. వేకువజామున ఆరు గంటలకు పైడితల్లి ఉత్సవ రథంతో పైడితల్లి దీక్షధారులు యాత్రను ఆలయ ఇన్‌చార్జి ఈఓ కె.శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలస సూపరింటెండెంట్ వై.వి.రమణ ప్రారంభించారు. పులివేషధారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు, భాజాభజంత్రీల నడుమ కోట, రంజనీ థియేటర్, తోమాల మందిరం, గంటస్తంభం, కన్యకపరమేశ్వరీ ఆలయం, ఎన్‌సీఎస్ రోడ్డు, గాడీఖానా మీదుగా రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడికి రథయాత్ర చేరుకుంది. రథయాత్రను రోడ్డుకిరువైపులా భక్తులు నిలబడి తిలకించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. జాతర మహోత్సవాల్లో చివరిఘట్టమైన చండీహోమం, పూర్ణాహుతి, దీక్షధారుల దీక్షల విరమణ, తదితర కార్యక్రమాలను వనంగుడిలో వేదపండితులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు.
వనంగుడిలో ఆధ్యాత్మిక శోభ
సిరుల తల్లి వనంగుడికి చేరుకునే వేళ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేదపండితులు కొందరు చండీయాగం నిర్వహిస్తుంటే, మరికొంతమంది సూర్యనమస్కారాలు, శక్తి పూజలు, అమ్మవారి ఉత్స విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు చండీయాగంలో పాల్గొని పూర్ణాహుతిని అమ్మవారికి సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు దీక్షధారుల ఇరుముడులను పైడిమాంబ ఆదిపీఠం వ్యవస్థాపకుడు ఆర్.సూర్యపాత్రో నేత్రత్వంలో గురుస్వాములు ఎస్.అచ్చిరెడ్డి, రంజిత్, తదితరులు ఇరుముడి విప్పి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఈఓ శిరీష మాట్లాడుతూ ఆరు నెలల పాటు అమ్మవారు వనంగుడిలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, వనంగుడి ప్రధాన అర్చకులు నేతేటి ప్రశాంత్, వేదపండితులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కృతజ్ఞతలు తెలిపిన కలెక్టర్
విజయనగరం అర్బన్: జిల్లాలో ఇటీవల నిర్వహించిన విజయనగరం ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమాను సంబరాన్ని విజయవంతం చేసిన వారందరికీ కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది మొత్తం 435 మంది దాతలు రూ.2.02 కోట్లను విజయనగరం ఉత్సవాలు–2025 బ్యాంక్ ఖాతాకు జమచేశారని, అందులో రూ.1.41 ఉత్సవ కార్యక్రమాల నిర్వహణకు వినియోగించగా రూ.61,12,885 వచ్చే ఏడాది ఉత్సవాలకు నిల్వ ఉంచినట్లు వివరించారు.

వైభవంగా పైడితల్లి రథయాత్ర

వైభవంగా పైడితల్లి రథయాత్ర