
తండ్రికి ఐదేళ్ల జైలు
విజయనగరం క్రైమ్: గతేడాది జిల్లాలోని బొబ్బిలి పోలీస్‌స్టేషన్ పరిధిలో కన్నకూతురిపై లైంగిక దాడికి యత్నించిన కేసులో ముద్దాయి అయిన తండ్రికి ఐదేళ్ల జైలు శిక్ష పడినట్లు ఎస్పీ దామోదర్ బుధవారం తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. బొబ్బిలిలోని ఇందిరమ్మ కాలనీలో ఉంటున్న కాసా నరసింగరావు (42) 2024 జులై 19 వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రలో ఉన్న తన 11 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి యత్నించినట్లు బాలిక అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి సీఐ ఎం.నాగేశ్వరరావు పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అనంతరం ఆ కేసును ప్రస్తుత బొబ్బిలి సీఐ కె.సతీష్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. నేరారోపణలు రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు కె.నాగమణి ముద్దాయికి 5 ఏళ్ల కారాగార శిక్ష రూ.2,00 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి పరిహారంగా రూ.50 వేలు మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారన్నారు.