
ఆడబిడ్డ నిధి అందదా?
వీరఘట్టం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు మహిళలందరికీ ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసి ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా ఖాతాలో జమ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రతి బహిరంగ సభలో హామీ ఇచ్చారు. ఆ మాటలు నమ్మి చాలా మంది అక్కచెల్లెమ్మలు ఓటేశారు. అయితే ఏం లాభం? కూటమి ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావొస్తున్నా..ఆడబిడ్డ నిధి పథకం అమలుపై మంత్రి వర్గ భేటీలో ఇంతవరకు ఒక్కసారి కూడా చర్చకు రాలేదు. అంటే ఈ పథకం కూడా గాలిలో కలిపేసినట్లేనా అని మహిహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హామీలు విస్మరించడం వెన్నతో పెట్టిన విద్య
ఎప్పడు అధికారంలోకి వచ్చినా ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. అంతేకాకుండా సంక్షేమ పథకాల అమలులో కూడా తూతూమంత్రంగా అమలు చేసి అనుకూల మీడియాలో ఆహా ఓహో బ్రహ్మండంగా రాయించుకోవడంలో ఆయనకు మించిన సిద్ధ హస్తుడు మరెవరూ ఉండరు. ప్రభుత్వం తీరు చూస్తే ఆడబిడ్డ నిధిని గంగలో కలిపేసినట్లేనని జిల్లా మహిళలు అభిప్రాయపడుతున్నారు.
గతంలో మహిళల జీవనోపాధికి అండ..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మహిళల జీవనోపాధికి పెద్దపీట వేశారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, ఈబీసీ నేస్తం, కాపునేస్తం, సున్నావడ్డీ, వైఎస్సార్ చేయూత లాంటి పథకాలన్నింటినీ నేరుగా మహిళల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి అండగా నిలిచారు. మహిళల చేతికి చేరిన నగదు వృథా కాకుండా ఇంటి అవసరాలకే ఉపయోగపడుతుందని భావించి అనేక పథకాల డబ్బును మహిళల ఖాతాల్లోనే జమ చేశారు.
రూ.573 కోట్లు బకాయి..
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని 3,09,425 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 60 ఏళ్లు పైబడిన వారిని మినహాయిస్తే 2024 అక్టోబర్ నాటి లెక్కల ప్రకారం 59 ఏళ్ల లోపు వారు 2.25 లక్షల మంది ఉన్నారు. వారికి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు నెలకు రూ.1500 చొప్పున చెల్లిస్తే నెలకు రూ.33.75 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ లెక్కన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలలకు రూ.573.75 కోట్లు చెల్లించాల్సి ఉంది.ఈ నగదు ఎప్పుడు చెల్లిస్తారని మహిళలు ప్రశ్నిస్తున్నారు.ఈ మెత్తాన్ని ఒకే విడతలో చెల్లించడంతో పాటు రాబోయే రోజుల్లో ప్రతినెలా రూ.1500 చెల్లించాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు.
17 నెలలు గడుస్తున్నా అమలుకు
నోచుకోని పథకం
ప్రతినెలా రూ.1500 చొప్పున
అందిస్తామని మోసం
గత ఎన్నికల్లో ఓటు వేసిన జిల్లాలో
మహిళలు 3,09,425 మంది
వారిలో 59 ఏళ్లలోపు మహిళలు 2.25 లక్షల మంది
మహిళలకు చెల్లించాల్సిన బకాయి రూ:573.75 కోట్లు