
జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడాపోటీలకు మిశ్రమ స్పందన
● ఎమ్మెల్యే రాక ఆలస్యంతో క్రీడాకారులకు తప్పని ఇక్కట్లు
భోగాపురం: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడా పోటీలకు మిశ్రమ స్పందన లభించింది. పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం నుంచి క్రీడాకారులు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చి మైదానంలో కూర్చుని ఎమ్మెల్యే లోకం నాగమాధవి రాక కోసం వేచి చూశారు. అయితే ఎంతసేపటికీ ఎమ్మెల్యే రాకపోవడంతో క్రీడాకారులు మైదానాన్ని వీడి బయటకు వెళ్లిపోతుండడంతో వ్యాయామ ఉపాధ్యాయులు క్రీడాకారులను బుజ్జగించి మైదానంలో కూర్చోబెట్టారు. ఎమ్మెల్యే పదకొండున్నర గంటలకు (రెండున్నర గంటల ఆలస్యంగా) వచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో అండర్–17 స్కూల్ గేమ్స్ వాలీబాల్ క్రీడా పోటీలు పన్నెండు గంటలకు ప్రారంభమై హోరాహోరీగా కొనసాగాయి. ఈ పోటీల్లో 150 మంది బాలురు, 100 మంది బాలికలు పాల్గొని సత్తా చాటారు. వారిలో విశేష ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌కు ఎంపిక చేసినట్లు జిల్లా స్కూల్‌గేమ్స్ సెక్రటరీలు గోపాల్, విజయలక్ష్మి తెలిపారు. వారు ఈ నెల 27, 28, 29 తేదీలలో ఈస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో జరగబోయే రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాజు (చిన్నారి), సింగిడి నాగన్న, తహసీల్దార్ రమణమ్మ, ఎంపీడీఓ స్వరూపరాణి, ఎంఈఓ రమణమూర్తి, గ్రామ పెద్దలు, మండలంలోని వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

జిల్లాస్థాయి వాలీబాల్ క్రీడాపోటీలకు మిశ్రమ స్పందన