
జ్ఞానకాంతులు... కలశజ్యోతులు
విజయనగరం టౌన్: పైడితల్లి నామస్మరణతో విజయనగరం పట్టణం ఆదివారం పులకరించిపోయింది. మాలధారుల కలశ జ్యోతుల వెలుగులో అమ్మవారి రథం ముందుకు సాగింది. వనంగుడి నుంచి చదురుగుడి వరకూ దారి పొడవునా భక్తులు జ్యోతి దర్శనం చేసుకున్నారు. చల్లంగ చూడాలంటూ తల్లిని శరణువేడారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారికి భక్తులు జ్యోతులతో నీరాజనం పలికారు. రైల్వేస్టేషన్ వద్దనున్న పైడితల్లి వనంగుడి నుంచి అమ్మ వారి ఉత్సవ విగ్రహంతో భారీ ర్యాలీ నిర్వహించారు. పైడిమాంబ దీక్షాధారులు జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ అంటూ నినాదాలు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వైవి.రమణి, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, సూపర్‌వైజర్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, పైడితల్లి దీక్షాపరులు కొబ్బరికాయలు కొట్టి ఉత్సవ రథాన్ని ప్రారంభించారు. ముందుగా ఆలయ ఆవరణలో కలశజ్యోతులను వెలిగించి, ఉత్సవ విగ్రహంతో పాటూ దీక్షాపరులు మూడుసార్లు ప్రదక్షణలు చేశారు. చీకటి అనే అజ్ఞానం నుంచి జ్ఞానమనే వెలుగును ప్రసాదించి అందరినీ చల్లగా కాపాడమని పైడితల్లికి పూజలు నిర్వహించారు.
వర్షంతో అమ్మకు చల్లదనం
పసిడి కాంతుల పైడితల్లి అమ్మవారు కలశజ్యోతుల నీరాజనానికి చల్లదనం చేయించుకున్నారు. దీపాలను వెలిగించిన కొద్దిసేపటికే వర్షం పడింది. వర్షం పడినంతసేపూ పైడితల్లి దీక్షాదారుల శరణుఘోషతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికత సంతరించుకుంది. రథాయాత్ర చదురుగుడికి చేరుకోగానే భక్తులు, దీక్షాదారులు అమ్మవారికి జ్యోతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైడితల్లి దీక్షా ఆదిపీఠం వ్యవస్థాపకులు ఆర్.సూర్యపాత్రో నేత్రత్వంలో పైడితల్లి దీక్షాపరులు, భక్తులు, దాతలతో చదురుగుడి వద్ద అంబలం పూజను ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.