
క్రైస్తవ విశ్వాసులు లోకానికి వెలుగునివ్వాలి
● ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త బెన్నీ ప్రసాద్
● ముగిసిన సిమ్స్ బాప్టిస్ట్ చర్చి
150వసంతాల వేడుక
విజయనగరం టౌన్: క్రైస్తవ విశ్వాసులు లోకానికి వెలుగై ఉన్నారని, అటువంటి క్రైస్తవులందరూ దీపంలా అనేకులకు వెలుగునివ్వాలని ప్రముఖ క్రైస్తవ ఆధ్యాత్మిక వేత్త బెన్నీ ప్రసాద్ (బెంగళూరు) పేర్కొన్నారు. సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150వసంతాల వేడుకల్లో చివరిరోజు ఆదివారం చర్చి ఆవరణలో నిర్వహించిన ఆధ్యాత్మిక సమావేశంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటూ జిల్లాలోని ఆధ్యాత్మిక క్రీస్తు సహోదరులకు ఆయన దైవసందేశాన్ని అందజేశారు. ఆయన ఆంగ్లభాషలో చెప్పిన దేవుని వాక్యాలను పాస్టర్ యబ్బోజు చౌదరి తెలుగులోకి అనువదించి భక్తులకు వివరించారు. విశ్వాసంతో, ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని రక్షణ పొందగలమన్నారు. అద్భుతమైన గిటార్ వాయిద్య సహకారంతో దేవుని కీర్తనాలాపన చేస్తూ, ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. సంఘమిత్ర ఆర్‌ఎస్.జాన్ మాట్లాడుతూ సిమ్స్ చర్చి 150వసంతాల వేడుకలను పెద్దలందరి సహాయ, సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించుకోగలిగామన్నారు. ఐదురోజుల పాటు నిర్వహించిన క్రైస్తవ మహాసభలకు హాజరై ఆధ్యాత్మిక దైవసందేశాన్నిచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సిమ్స్ జూబ్లీ కమిటీ చైర్మన్ ఎం.ఎ.నాయుడు, కార్యదర్శి తాలాడ ఆనందరావు, వై.ప్రభాకర్, ఆశాజాన్ తదితరులు పాల్గొన్నారు.