
‘అంగన్‌వాడీ’లపై ధరాభారం
కేంద్రాల నిర్వహణలో పెరిగిన వ్యయం.. అంగన్‌వాడీ కేంద్రాలకు అదనపు ఖర్చులు 2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగానే ఇప్పటికీ బిల్లుల చెల్లింపు ప్రస్తుతం మూడు రెట్లు పెరిగిన నిత్యావసరాల ధరలు పట్టించుకోని కూటమి ప్రభుత్వం
ఉన్నతాధికారులకు విన్నవించాం..
రామభద్రపురం:
చిన్నారులకు తొలి బడి అమ్మ అయితే.. మలిబడి అంగన్‌వాడీ కేంద్రాలే. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కేంద్రాలకు వచ్చే చిన్నారుల భవితను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వీటిలోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి. ప్రస్తుత ధరలకు అనుగుణంగా బిల్లులు పెంచుతామని ప్రభుత్వం చెబుతున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికీ కనీస ఆలోచన చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో కార్యకర్తలకు భారంగా మారింది. అసలే వారి జీతాలు అంతంత మాత్రం. దీనికి తోడు పాత ధరల ఆధారంగా బిల్లులు చెల్లిస్తుండడంతో వంట ఖర్చులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేంద్రాల్లో పౌష్టికాహారం ఇచ్చి ధరలను పెంచాలని కార్యకర్తలు వినతులు ఇవ్వడంతో పాటు డిమాండ్ చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే ప్రీ స్కూల్ పిల్లల ఆహారం కోసం కూరగాయలు, ఆకు కూరలు, పసుపు, చింత పండు, కారం, పోపు తదితర సామగ్రి ఎప్పటికప్పుడు సిద్ధం చేసుకోవాలి. వీటి కొనుగోలుకు ఒక చిన్నారికి వారానికి రూ.50 ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిసింది. ఇవి ఏమాత్రం సరిపోవడం లేదని నిర్వాహకులు వాపోతున్నారు. వారానికి ఒకరికి కూరగాయలు, పోపులకు రూపాయిన్నర, గ్యాస్‌కు నెలకు రూ.450 చొప్పున్న ఇస్తున్నారు. సిలిండర్ రూ.950 లకు కొనుగోలు చేస్తున్నామని ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా మెనూ ప్రకారం వండి పెట్టాలంటే అదనపు భారం తప్పడం లేదని అంగన్‌వాడీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మెనూ ప్రకారం బిల్లులు
మెనూ ప్రకారం 2022 ఫిబ్రవరి ధరలకు అనుగుణంగా ప్రస్తుతం బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరల మూడు రెట్లు పెరిగాయి. అలాగే గ్యాస్ ధర కూడా బిల్లు చెల్లించిన దానికంటే అదనంగా మరో రూ.500 వరకు పెరిగింది. ప్రస్తుతం మెనూ ప్రకారం వండి పెట్టాలంటే తమకు భారంగా ఉందని ప్రస్తుత ధరల ప్రకారం బిల్లులు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకేనా..
కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలలను ప్రోత్సహించేందుకే బాల్య దశలోనే విద్యా పరంగా గట్టి పునాదులు వేసే అంగన్‌వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేటు పాఠశాలలకు చిన్నారులు మళ్లే అవకాశం ఉంది. సాధారణంగా చిన్నారులు ప్రీ స్కూల్‌కు ఎక్కడ చేరితే అదే విద్యా సంస్థల్లోనే విద్యార్థిగా కొనసాగే అవకాశం ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తే చిన్నారులు ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎల్‌కేజీ, యూకేజీల్లో చేరే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆ తర్వాత కూడా ప్రైవేట్ పాఠశాలల్లోనే చదువు కొనసాగిస్తారు. దీంతో ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేకూరుతుంది. కేవలం కార్పోరేట్ విద్యా సంస్థలకు మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ ఆలోచన కూడా అదే రీతిలో ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
కొత్త ధరలు ప్రకారం బిల్లులు ఇవ్వాలని అంగన్‌వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. ప్రభుత్వం పెంచిన వెంటనే కొత్త ధరల ప్రకారం బిల్లులు పెడతాం.
– ఎం.వరహాలమ్మ, సీడీపీవో, బాడంగి

‘అంగన్‌వాడీ’లపై ధరాభారం