
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ సాయం లేదు..
ప్రస్తుత కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయలేదు. జిల్లాలో వేలాది మంది కౌలు రైతులు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ పథకం సాయం అందని పరిస్థితి.
జిల్లాలో కౌలు రైతులు 13,635 మంది ఉన్నారు. వీరిలో అతి తక్కువ మందికి మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. ఖరీఫ్‌లో కౌలు రైతులకు రూ.140 కోట్ల పంట రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ఇంతవరకు కేవలం 601 మందికి రూ.3 కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చారు.
కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. సాధారణ రైతులు అయితే భూమిని హామీగా చూపిస్తే ఏ వ్యాపారి అయినా డబ్బులు ఇచ్చే పరిస్థితి. కాని కౌలు రైతులకు ఆ అవకాశం కూడా లేదు. ఎందుకంటే భూమికి యాజమాని వేరొకరు ఉంటారు కాబట్టి. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తెచ్చి పంట సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటు ప్రభుత్వం నుంచి సాయం అందక, అటు రుణాలు అందక కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారు.