
జేఎన్‌టీయూ జీవీలో ఫార్మసీ కళాశాల ప్రారంభం
● ఆన్‌లైన్‌లో సర్టిఫికేషన్ కోర్సులు
● రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ
విజయనగరం అర్బన్: జేఎన్‌టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ప్రాంగణంలో ఫార్మసీ కళాశాలను ప్రారంభించేందుకు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) అనుమతులు మంజూరు చేసిందని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ శనివారం తెలిపారు. ఈ ఫార్మసీ కళాశాల అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానుందని ఆమె వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా ఈ సంవత్సరం నుంచి పలు సర్టిఫికేషన్ కోర్సులు, ఫార్మసీ కోర్సులను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కోర్సుల ఆన్‌లైన్ విధానంలో అందుబాటులో ఉంటాయి. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో పలు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తామని తెలిపారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ (3 నెలల కాల వ్యవధి), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు టూల్స్ (ఒక నెల కాల వ్యవధి), మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ (ఒక నెల కాల వ్యవధి), సైబర్ సెక్యూరిటీ (ఒక నెల కాల వ్యవధి), క్వాంటం కంప్యూటింగ్ (ఒక కాల వ్యవధి) కోర్సులు ఉన్నాయని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం 7780351078 ఫోన్ నంబరును సంప్రదించాలని, జేఎన్‌టీయూజీవీ.ఈడియూ.ఐఎన్/సర్టిఫికేషన్ కోర్సుల వెబ్‌సైట్ నుంచి తెలుసుకోవచ్చని సూచించారు.