
గుడి దొంగల అరెస్టు
పూసపాటిరేగ : మండలంలోని కనిమెల్ల గ్రామంలో దొంగతనం చేసిన నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాదు శనివారం తెలిపారు. పూసపాటిరేగ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కనిమెల్ల గ్రామంలోని గుడిలో ఇద్దరు నిందితులు దొంగతనం చేసినట్టు తేలడంతో సొత్తు రికవరీ చేసినట్టు తెలిపారు. పేరాపురం, కోనాడ గ్రామాలలో ఇదే వ్యక్తులు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలో కాపర్ వైర్ దొంగతనానికి పాల్పడినట్టు పేర్కొన్నారు.
డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.8.50 లక్షల జరిమానా
విజయనగరం క్రైమ్ : మద్యం సేవించి వాహనాలు నడిపి, పట్టుబడిన 85 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషి యల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. మద్యం సేవించి, వాహనాలు నడిపిన వారిపై 85 కేసులు నమోదు చేశారు. అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున మొత్తం 85 మందికి రూ.8.50 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు.
15 నుంచి స్కూల్ గేమ్స్ జిల్లా జట్ల ఎంపికలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 15 నుంచి నిర్వహించనున్నట్టు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి శనివారం తెలిపారు. 15న రాజీవ్ స్టేడియంలో బాక్సింగ్ పోటీలు, కొండవెలగాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెజ్లింగ్ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. 16న విజయనగరం విజ్జీ స్టేడియంలో తైక్వాండో, స్కేటింగ్, సైక్లింగ్ పోటీలు, మరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రగ్బీ పోటీలు నిర్వహిస్తామన్నారు. 17న విజయనగరంలో ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ క్రీడాంశంలో, బూర్జ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్చరీ క్రీడాంశంలో ఎంపికలు జరుగుతాయన్నారు. అండర్ – 14, 17 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించే పోటీల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మహిళా రోగి పట్ల రేడియోగ్రాఫర్ అసభ్య ప్రవర్తన!
● సర్వజన ఆసుపత్రిలో ఘటన
● ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
విజయనగరం ఫోర్ట్: ఎక్సరే కోసం వెళ్లిన ఓ మహిళ పట్ల సర్వజన ఆసుపత్రిలో పని చేస్తున్న ఓ రేడియోగ్రాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరా ల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలానికి చెందిన ఓ మహిళ ఫైల్స్ వ్యాధితో సర్వజన ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆపరేషన్ చేయాలని ఆసుపత్రిలో ఇన్‌పేషంట్‌గా చేర్చారు. శనివారం ఎక్సరే తీయించాలని వైద్యులు చీటి రాసి ఇవ్వడంతో అది పట్టుకుని మహిళ ఎక్సరే విభాగానికి వెళ్లింది. ఎక్సరే గదిలోకి వెళ్లిన మహిళ పట్ల ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న ఓ రేడియాగ్రాఫర్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె కేకలు వేస్తూ బయటకు వచ్చేసింది. గది బయట ఉన్న తన భర్తకు విషయం చెప్పడంతో సదరు ఉద్యోగిపై ఆసుపత్రి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఉద్యోగికి ఆసుపత్రి అధికారులు మెమో జారీ చేసినట్టు తెలిసింది. ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా తమ దృష్టికి ఈ విషయం వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.