
తాగిన మైకంలో యువకుడి ఆత్మహత్య
పార్వతీపురం రూరల్/గుమ్మలక్ష్మీపురం: మద్యం తాగి ఆ మైకంలో తనకు తానే పదునైన చాక్‌తో తోయక చంద్రశేఖర్(32) అనే యువకుడు తన గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక తాడికొండ పీహెచ్‌సీకి తరలించారు. ప్రాధమిక వైద్యసేవలు అనంతరం భద్రగిరి సీహెచ్‌సీకు తరలించి వైద్యుల సూచన మేరకు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ మృతి చెందినట్టు పార్వతీపురం కేంద్ర ఆసుపత్రి అవుట్‌పోస్టు పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. పుట్టికతోనే వినికిడి, మూగ సమస్యలతో దివ్యాంగుడైన చంద్రశేఖర్ తాగుడుకు బానిస అయ్యాడు. అప్పుడప్పుడు మద్యం మత్తులో మతి భ్రమించినట్టు ప్రవర్తిస్తుంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కురుపాం మండలంలోని తెన్నుఖర్జలో తన చెల్లి ఇంటికి వెళ్లి తాగి మద్యం మత్తులో ఉన్న చంద్రశేఖర్‌ను మందలించడంతో తన స్వగ్రామమైన ఎగువతాడికొండకు మూడు రోజుల క్రితం వచ్చి ఎప్పటిలాగే శుక్రవారం మద్యం సేవించి శనివారం వేకువజామున 3గంటల ప్రాంతంలో గొంతుకోసుకుంటూ ఆత్మహత్యకు పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే వైద్యసేవలకు తరలించామన్నారు. మృతుడు తల్లితండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా సోదరుడు కిశోర్‌తో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు.
మహిళ ఆత్మహత్య
విజయనగరం క్రైమ్ : నగరంలోని వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలో ఓ మహిళ శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. విజయనగరం రూరల్ ఎస్‌ఐ అశోక్ తెలిపిన వివరాలు... కొత్తవలసకు చెందిన భారతి గుజరాత్‌కు చెందిన షిండేను వివాహం చేసుకుంది. షిండే మోసగాడని తెలిసి విబేధించి అతనకు దూరంగా ఉంటుంది. ఈ విషయం కొత్తవలస పోలీసులకు తెలిసి ఆమెను విజయనగరంలోని వీటీ అగ్రహారం మహిళా ప్రాంగణంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఉన్న హోమ్‌కు తరలించారు. ఇక్కడ చేరిన తరువాత భారతి శనివారం బాత్రూమ్‌కని వెళ్లి ఎంతకీ తిరిగి రాలేదు. హోం సిబ్బంది అనుమానంతో తలుపు పగలగొట్టి చూడగా బాత్రూమ్‌లోని కిటికీకి చున్నీతో కట్టి ఆత్మహత్య చేసుకుంది. హోం ఉద్యోగి భవ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్‌ఐ అశోక్ ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.