
అవస్థల ప్రయాణం..!
పార్వతీపురంటౌన్: సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళాసంక్షేమ పథకాలను పక్కన పెట్టి సీ్త్రశక్తి ఉచిత బస్సు అమలు చేసి మమ అనిపించింది. ఆగస్టు 15న సీ్త్రశక్తి పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా ఆర్టీసీ నష్టాల బాటలో నడుస్తున్నప్పటికీ, జిల్లాలో సరిపడా బస్సులు లేకపోయినప్పటికీ ఉచిత బస్సు ప్రయాణంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని గ్రామాలకు సర్వీసులు నడిపే పరిస్థితి లేకపోయింది. మన్యం జిల్లాలో ఎక్కువ గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలు పెద్దసంఖ్యలో ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ప్రయాణం అవస్థల ప్రయాణంగా సాగుతోంది. ఆక్యుపెన్సీ లేని కొన్ని గ్రామాలకు, రోడ్డు బాగాలేని కొన్ని గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు రద్దుచేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ మేరకు ట్రిప్‌లు కుదించారు. జిల్లాపరిధిలోగల సాలూరు, పాలకొండ, పార్వతీపురం డిపోలలో బస్సుల కొరత ఉంది. ఉన్న బస్సుల కండిషన్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. వాటి పరిష్కారంపై ప్రభుత్వం దృష్టిసారించకుండా ఉచిత బస్సు పథకంతో ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న పరిస్థితి నెలకొంది.
జిల్లాలో 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే..
జిల్లా వ్యాప్తంగా మూడు డిపోల పరిధిలో 237 బస్సులు ఉంటే అందులో పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులు కలిపి మొత్తం 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే ఉపయోగిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో కేవలం 50 బస్సులు మాత్రమే సాధారణ సర్వీసులు నడుపుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గిరిజన, మారుమూల మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటే బస్సులు సరిగ్గా లేక ప్రయాణ అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సుల కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ పథకానికి బస్సులు వేయడంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి జిల్లా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది.
గంటల తరబడి వేచి చూడాల్సిందే
జిల్లాలో మూడు డిపోల పరిధి నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దానికి తోడు రహదారులు గుంతలమయం కావడంతో ఎప్పటికప్పుడు ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడడం, డిపోలకు సమయానికి బస్సులు రాకపోవడం, కాజ్‌వేలు, వంతెనలు మరమ్మతులకు గురవడం వంటి సమస్యలతో బస్సులు సమయానికి దొరకక వేచిచూడాల్సిన పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. జిల్లాలో బస్సుల సంఖ్యను పెంచి ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు.
సీట్ల కోసం రోజూ గొడవలే..
అసలే అరకొర బస్సులతో బస్సులకు ప్రయాణికుల తాకిడి ఎక్కువ అవుతోంది. దూర ప్రాంతాలకు ప్రయాణించే వారు సీట్లు సరిగా దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా మేము రుమాలు వేశామని ఒకరు..మేము టవల్ వేశామని మరొకరు ఇలా ఒక్కో సాకుతో ప్రతిరోజూ బస్సుల్లో గొడవలు పడుతున్న సందర్భాలు అనేకం. బస్సుల్లో పురుషులు ప్రయాణం చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. డిపోల నుంచి బయలు దేరిన కొన్ని బస్సుల్లో పురుషులపై మహిళలు దాడికి పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి.. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే బస్సుల సంఖ్య పెంచి సర్వీసులను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఓ వైపు చాలీచాలని బస్సులు..మరో వైపు పాడైపోయిన రహదారులతో సమయానికి రాని బస్సులు..ఇంకో వైపు సీ్త్ర శక్తి పథకానికి కేటాయించిన బస్సుల్లో అధిక రద్దీతో గొడవలు..వెరసి సాధారణ ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించేందుకు సతమవుతున్నారు. బస్సుల సమస్యకు పరిష్కారం చూపించాలని ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది కోరుతున్నారు.
అరకొరగా బస్సులు
ఉచిత బస్సుల్లో రద్దీ ఇబ్బందులు
ఆక్యుపెన్సీ లేదని కొన్ని గ్రామాలకు బస్సుల రద్దు
జిల్లాలో మూడు డిపోల పరిధిలో 237 ఆర్టీసీ బస్సులు
వాటిలో 187 బస్సులు సీ్త్రశక్తి పథకానికే
తీవ్ర ఇక్కట్లు పడుతున్న సాధారణ
ప్రయాణికులు