
పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష
విజయనగరం క్రైమ్/తెర్లాం: ఈ ఏడాది ఫిబ్రబరి నెలలో నమోదైన పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు కిరణ్ (36)కు మూడేళ్ల జైలు శిక్షను విధిస్తూ పోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. కేసు వివరాలిలా ఉన్నాయి. జిల్లాలోని తెర్లాంకు చెందిన ఓ బాలిక (12) నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కంకణాల కిరణ్ వెనక నుంచి వచ్చి బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో, దగ్గరలో ఉన్న కొంత మంది వచ్చేసరికి నిందితుడు పారిపోయాడు. ఆ బాలిక ఇంటికెళ్లి కన్నవారికి చెప్పగా బాలిక తల్లి తెర్లాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ బి.సాగర్ బాబు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు నమోదైన 7 నెలల కాలంలోనే ప్రాసిక్యూషన్ పూర్తయ్యే విధంగా తెర్లాం ఎస్సై బి.సాగర్ బాబు చర్యలు చేపట్టారని ఎస్పీ తెలిపారు. కోర్టులో నేరారోపణలు రుజువు కావడంతో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష, బాధితురాలికి పరిహారంగా రూ.25,000 ఇవ్వాలని పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారని ఎస్పీ వివరించారు.
115 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.11.50 లక్షల జరిమానా
మద్యం తాగి వాహనాలు నడిపి, పట్టుబడిన 115 మంది వాహనదారులు ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానాను విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎం.ఎస్.హెచ్.ఆర్.తేజ చక్రవర్తి విధించారని ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో విజయనగరం ట్రాఫిక్ సీఐ సూరినాయుడు ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 115 కేసులు నమోదు చేసి విజయనగరం అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా వారందరికీ రూ.11.50 లక్షలను జరిమానాగా విధించారని ఎస్పీ తెలిపారు.

పోక్సో కేసులో ముద్దాయికి మూడేళ్ల జైలు శిక్ష