
14న జూనియర్స్ కబడ్డీ జట్ల ఎంపిక
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడకారుల ఎంపిక పోటీలు ఈనెల 14న నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌క్రీడామైదానంలో ఎంపిక పోటీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎంపిక పోటీల్లో 2006 జనవరి 1వ తేదీ అనంతరం జన్మించి, బాలురు 75 కేజీల లోపు, బాలికలు 65 కేజీల లోపు బరువు కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు కృష్ణా జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల క్రీడాకారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు ఫోన్ 9949721949 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఏపీలో ఉత్తమ రిసార్ట్స్‌గా సన్‌రే
భోగాపురం: భోగాపురంలోని ఎ.రావివలస సమీపంలో ఉన్న సన్‌రే విలేజ్ రిసార్ట్స్ ఏపీ ఉత్తమ టీం బేస్ట్ రిసార్ట్‌గా గుర్తింపు పొందడం సంతోషించ దగ్గ విషయమని మేనేజింగ్ డైరెక్టర్ ఇందుకూరి రాజాబాబు తెలిపారు. ఈ మేరకు విజయవాడలో శుక్రవారం జరిగిన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని, రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, భరత్ చేతులమీదుగా ఏపీ ఉత్తమ టీం రిసార్ట్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ పురస్కారంతో వరుసగా ఏడోసారి గౌరవం దక్కినందుకు సంతోషిస్తున్నానని రాజాబాబు పేర్కొన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఉద్యోగి కృషికి ఆయన అభినందనలు తెలియజేశారు.