
మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు : డీఎంహెచ్‌వో
విజయనగరం ఫోర్ట్: మాతృ, శిశు మరణాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం మాతృ, శిశు మరణాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రక్తహీనత ఉన్న గర్భిణులకు ఐరన్ మాత్రలు అందించాలన్నారు. రక్తం అవసరమైన వారికి రక్తం ఎక్కించాలని తెలిపారు. ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహార పదార్ధాలు ప్రతీ రోజు భోజనంలో ఉండేటట్టు చూడాలన్నారు. హైరిస్క్ గర్భిణులను ముందుగానే ఆసుపత్రిలో చేర్పించి ప్రసవం అయ్యే వరకు పర్యవేక్షణ చేయాలన్నారు. మాతృ, శిశు మరణాలు పునరావృతం అయితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో డాక్టర్ బి.శ్రీనివాస్, డాక్టర్ సుజాత, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ దీపక్ తదితరులు పాల్గొన్నారు.