
దోపిడీకి అడ్డాగా వారపు సంతలు
● తూనికల్లో వ్యత్యాసం
● కల్తీ సరుకులదే రాజ్యం
● సంతల ద్వారానే ఏజెన్సీలకు ఖైనీ, గుట్కా సరఫరా
● మోసపోతున్న గిరిజనం
కురుపాం: ఏజెన్సీలో వ్యాపారుల దోపిడీకి అడ్డాగా వారపు సంతలు నిలుస్తున్నాయి. కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో జరుగుతున్న వారపు సంతల్లో కల్తీ సరుకులు రాజ్యమేలుతున్నాయి. నిత్యావసర సరుకులైన పప్పులు, నూనెలు, కారం, పసుపు, సబ్బులు, వంట దినుసులు సైతం కల్తీలే ఎక్కువగా విక్రయిస్తున్నారు. ప్రతీ గురువారం కురుపాం మండల కేంద్రంలో జరిగే వారపు సంతకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఆ ఒక్క రోజే ఈ సంతలో రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ వారపు సంతపైనే నియోజకవర్గంలోని కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన గిరిజనులు ఆధార పడుతుంటారు. గిరిజనులు పండించే ఫల సాయాలను వారపు సంతకు తెచ్చి వస్తు మార్పిడి ద్వారాగానీ, విక్రయించగా వచ్చిన డబ్బులతో తమకు అవసరమైన నిత్యావసర సరుకులను స్థానికంగా ఉన్న వ్యాపారుల వద్ద, వారపు సంతలో కొనుగోలు చేస్తారు.
దోపిడీకి అడ్డాగా..
కురుపాం నియోజకవర్గంలో ఉన్న గిరిజన మండలాల్లో ప్రతీ వారం వారపు సంతలు నిర్వహిస్తున్నప్పటికీ వీటన్నిటిలో కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రాల్లో జరిగే వారపు సంతల్లోనే రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ వారపు సంతల్లో వ్యాపారుల తూకంలో భారీ వ్యత్యాసం కూడా ఉంటుందని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ కాటాలు వచ్చిన నుంచి మరింత దోపిడీ ఎక్కువైందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ కాటాల్లో వ్యాపారులు చేతివాటం (మైనస్ నంబర్ ఫీడింగ్) వలన గిరిజనులు మోసానికి గురవుతున్నారు. గిరిజన రైతులు తెచ్చే అల్లం, పసుపు, చిరుధాన్యాలు, కాయగూరలు, చింతపండు వంటి వస్తువులను ఇంటి వద్ద ఉన్న వారి కాటాల్లో గిరిజనులు సక్రమంగానే తూచి స్థానిక మార్కెట్లోకి, వారపు సంతల్లో విక్రయించేందుకు తీసుకొని రాగా 3 కేజీల నుంచి 5 కేజీల వరకు తక్కువ వ్యాపారులు చూపిస్తూ తమను మోసం చేస్తున్నారని గిరిజనులు వాపోతున్నారు.
ఖైనీ, గుట్కా విక్రయాలు జోరు..
వారపు సంతల ద్వారానే ఏజెన్సీలోని గ్రామాలకు ఖైనీ, గుట్కా వంటివి వారపు సంతల్లో వ్యాపారుల ద్వారానే ఏజెన్సీలోని గ్రామాలకు విస్తరిస్తున్నాయి. విచ్చలవిడిగా విక్రయాలు జోరందుకోవడంతో చాలా వరకు గిరిజన యువత కేన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు, తూనికలు కొలతల శాఖ, నకిలీ వస్తువులు, నిత్యావసర సరుకులపై దృష్టి సారించాలని గిరిజన రైతులు కోరుతున్నారు.
వారపు సంతల్లోనే..
దశాబ్దాలుగా తామ పండించిన చింత, జీడి, పసుపు, అల్లం వంటి ఫల సహాయాలను వారపు సంతల్లోనే వ్యాపారులకు విక్రయిస్తుంటాం. తద్వారా మాకు అవసరమైన నిత్యావసర సరుకులను తమ వెంట తీసుకువెళ్తాం. అవి నాణ్యమైనవో లేక నాణ్యత లేనివో తెలియదు. తూకంలో కూడా వ్యత్యాసాలు ఉంటున్నాయి. – తోయక బాబూరావు,
దురుబిలి గ్రామం, కురుపాం మండలం
అధికారులు దృష్టి సారించాలి
వారపు సంతల్లో వస్తువులు, ఎలక్ట్రానిక్ కాటాలపైన సంబంధిత అధికారులు దృష్టి సారించాలి. అవగాహన లేని గిరిజనులకు తూనికలు కొలతల్లో మోసం జరుగుతుంది. దీంతో అమాయక గిరిజనం నష్టపోతున్నారు. మోసం చేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి.
– ఇంటికుప్పల రామకృష్ణ,
ట్రైబల్ రైట్ ఫొరం, జిల్లా అధ్యక్షుడు

దోపిడీకి అడ్డాగా వారపు సంతలు

దోపిడీకి అడ్డాగా వారపు సంతలు

దోపిడీకి అడ్డాగా వారపు సంతలు