
చెరువుకు గండికొట్టి మా పొట్ట కొట్టారు..
● టీడీపీ నేతల అండతో జేసీబీతో చెరువుకు గండి
● వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమనే కక్ష
గజపతినగరం : పిడిశీల గ్రామానికి చెందిన తాము పుష్కర కాలంగా చెరువు ద్వారా పంట పొలాలకు సాగునీరు వాడుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటే తాము వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమనే కక్షతో టీడీపీ నేతల అండతో చెరువులకు జేసీబీతో గండికొట్టి తమ పొట్ట కొట్టారని సర్పంచ్ పాండ్రంకి సూర్యమాధవి గురువారం తెలిపారు. గతంలో ఓ వ్యక్తికి చెరువు లీజుకు ఇవ్వడంతో ఇందులో చికెన్ వ్యర్థాలు వేసి హాని తలపెట్టడంతో గత జూలై నెలలో గ్రీవెన్స్‌లో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో అధికారులు తనిఖీ చేసి తాత్కాలికంగా చెరువు లైసెన్స్ అధికారులు నిలుపు చేశారని పేర్కొన్నారు. తరువాత చెరువులను క్లోరినేషన్ చేయించి మళ్లీ రీఓపెనింగ్ పెట్టుకోవాలని సూచించారని తెలిపారు. దీనికి ఫిషరీస్‌కు సంబంధించి పర్మినెంట్ లైసెన్సు ఉండడంతో దాన్ని గ్రీవెన్స్‌లో పెట్టామని పేర్కొన్నారు. తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ కొన్ని సూచనలు చేసి సంతకాలతో కూడిన స్టేట్‌మెంట్‌ను తీసుకున్నారని తెలిపారు. తరువాత చెరువు వినియోగానికి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఇంతలో టీడీపీ మంత్రి జోక్యం చేసుకుని కలెక్టర్ ద్వారా ఏడాది పాటు చెరువులను తెరవకుండా లైసెన్స్‌ను నిలిపివేశారని పేర్కొన్నారు. చివరకు మంత్రి ఆదేశాలతో రాజకీయ కక్షతో చెరువును జేసీబీతో తవ్వేశారని పాండ్రంకి సూర్యప్రకాష్ దంపతులు విలేకరుల వద్ద తమ గోడు వెలిబుచ్చారు. టీడీపీ నేతల ఒత్తిళ్లతో రెవెన్యూ, ఫిషరీస్, పోలీసు అధికారులు మూకుమ్మడిగా వచ్చి తమ చెరువు ఖాళీ చేయించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై సంబంధిత అధికారుల వద్ద సాక్షి ప్రస్తావించగా చెరువు లైసెన్స్ తాత్కాలికంగా నిలుపుదల చేశామని, క్లియరెన్స్ చేసుకుంటే మళ్లీ అనుమతులు ఇస్తామని తెలిపారు.

చెరువుకు గండికొట్టి మా పొట్ట కొట్టారు..