
హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం..
● ఏపీ హోటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు
విజయనగరం: రాష్ట్రంలో హోటల్ అసోసియేషన్ రంగాన్ని రానున్న కాలంలో మరింత బలోపేతం చేస్తామని, హోటల్ రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టణంలోని మెట్రో కన్వెన్షన్‌లో గురువారం జరిగిన ఏపీహెచ్‌ఏ రాష్ట్ర అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షునిగా విజయనగరం పట్టణానికి జి.శ్రీనివాసరావు, కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన కలమెడి రమణ, కార్యనిర్వాహక కార్యదర్శిగా ఒంగోలుకు చెందిన ఎదపాటి కొండయ్య, కోశాధికారిగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన బైల లక్ష్మీనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల పరిశీలకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో నూతన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన అనంతరం రాష్ట్రంలో హోటల్ రంగం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల తమ సహాయ సహకారాలు అందిస్తామని, అలాగే హోటల్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి న్యాయం చేయాలని కోరారు. హోటల్ రంగం ఒక ఇండస్ట్రీగా పని చేస్తుందన్నారు. లక్షలాది మందికి ఉపాధి కల్పించే హోటల్ రంగం నుంచి ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయంతో పాటు పర్యాటకంగా అనేక సేవలను అందించడం జరుగుతుందన్నారు. త్వరలోనే అసోసియేషన్ తరఫున ప్రభుత్వ పెద్దలను కలిసి మా యొక్క సమస్యలను విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాల అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శులు, హోటల్స్ యజమానులు పాల్గొన్నారు.