
వైద్యం వికటించి మహిళ మృతి
● పీఎంపీ వైద్యుడి నిర్వాకం
● ఆందోళనకు దిగిన బంధువులు
భామిని: మండలంలోని ఘనసర గ్రామానికి చెందిన కిల్లారి తేజాలు(58) కొత్తూరుకు చెందిన శ్రీసాయి ప్రజావైద్యశాలలో వైద్యానికి వెళ్లి మృతి చెందింది. తేజాలు మృతికి పీఎంపీ వైద్యుడు వై.నాగేశ్వరరావు నిర్లక్ష్యమే కారణమని బంధువులు ప్రజా వైద్యశాల ముందు ఆందోళనకు దిగారు. చివరకు కొత్తూరు ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు మృతురాలి బంధువులకు నచ్చజెప్పి మృతదేహాన్ని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఘనసర గ్రామానికి చెందిన తేజాలు కాళ్లు, చేతులు పీకుతున్నాయని భర్త తవిటినాయుడుతో కలిసి కొత్తూరులోని శ్రీసాయి ప్రజా వైద్యశాలకు గురువారం వెళ్లింది. అక్కడ పీఎంపీ వైద్యుడు నాగేశ్వరరావు రెండు ఇంజక్షన్లు వేసే సమయానికి తేజాలు అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందిందని భర్త తెలిపాడు. విషయం తెలుసుకున్న తేజాలు బంధులు ప్రజా వైద్యశాల వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న కొత్తూరు ఎస్‌ఐ అక్కడకు చేరుకొని మృతురాలి బంధువులను శాంతింపజేశారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పాతపట్నం ఆసుపత్రికి తరలించారు.