
ఒకే రైతుకు 50 బస్తాల యూరియా విక్రయం
● విచారణ చేసిన విజిలెన్స్, వ్యవసాయ అధికారులు
● ఎరువుల దుకాణ డీలర్‌పై చర్యలకు సిఫార్సు
తెర్లాం: మండలంలోని సుందరాడ గ్రామంలోని ఎరువుల దుకాణ డీలర్‌పై చర్యలకు విజిలెన్స్, వ్యవసాయ అధికారులు సిపార్సు చేశారు. దీనికి సంబంధించి మండల వ్యవసాయ అధికారి బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎరువుల దుకాణ డీలర్ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఒకే రైతుకు 50 యూరియా బస్తాలు విక్రయించినట్లు ఈపోస్ యంత్రంలో నమోదు చేశాడు. దీనిని గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఎరువుల డీలర్‌పై దర్యాప్తు నిమిత్తం వచ్చారు. ఫెర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్–1985 ప్రకారం ఒక రైతుకు ఎక్కువ యూరియా బస్తాలు విక్రయించడం నేరం కావడంతో దీనిపై మండల వ్యవసాయ అధికారి బొత్స శ్రీనివాసరావు, విజిలెన్స్ కానిస్టేబుల్ తిరుపతిరావు, సుందరాడ వీఏఏ దేముడు గ్రామానికి వచ్చి ఎరువుల దుకాణ డీలర్ వద్ద ఉన్న రికార్డులను గ్రామ పెద్దలు, రైతుల సమక్షంలో తనిఖీ చేశారు. ఎరువుల దుకాణ డీలర్ ఒక రైతుకు 50బస్తాల యూరియా విక్రయించినట్లు రికార్డుల్లో నమోదు కావడంపై అతనిపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు సిఫార్సు చేసినట్లు విజిలెన్స్, వ్యవసాయ అధికారులు తెలిపారు.