
రైతులకు రూ.85 లక్షల టోకరా!
● రైతులకు తప్పుడు రశీదులు
● సభ్యులందరికీ నోటీసులిచ్చి విచారణ జరుపుతాం
గరుగుబిల్లి: గరుగుబిల్లి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో (పీఏసీఎస్) అక్రమాలు జరిగాయి. రైతులకు తప్పుడు రశీదులు ఇచ్చి సుమారు రూ.85 లక్షలకు టోకరా పెట్టినట్టు ప్రాథమిక సమాచారం. పీఏసీఎస్‌లలో కంప్యూటరీకరణతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గరుగుబిల్లి పీఏసీఎస్ పరిధిలోని 12 గ్రామాలకు చెందిన 1400 మంది రైతులు ప్రాథమిక సభ్యత్వం కలిగి ఉన్నారు. వీరిలో చాలామంది రుణాలు తీసుకున్నారు. పీఏసీఎస్ సీఈఓ ఈ ఏడాది ఏప్రిల్ 2న అకాలమరణం పొందారు. ఇక్కడ జరిగిన అక్రమాలపై విజయనగరం డీసీసీబీ చీఫ్ మేనేజర్ సంతోష్‌కుమార్ ప్రాథమిక దర్యాప్తును నిర్వహించగా 31 మంది రైతుల పేరున రూ. 85 లక్షల వరకు కాజేసినట్టు నిర్ధారించారు. మరింత లోతైన దర్యాప్తునకు విచారణాధికారిగా జిల్లా సహకారశాఖాధికారిని నియమించి, రెండు నెలల్లో దర్యాప్తును పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మేరకు పీఏసీఎస్‌లో ఆగస్టు 22 నుంచి రైతులకు నోటీసులను జారీచేసి కార్యాలయంలోనే విచారణ చేపడుతున్నారు.
రశీదులతోనే...
సొసైటీ నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే క్రమంలో ఒక రశీదు రైతుకు, బ్యాంకునకు ఒక రశీదు సమర్పించాలి. మూడో రశీదు కార్యాలయంలో ఉంటుంది. ఈ రశీ దుల జారీలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయి. అప్పుతీసుకున్న రైతుకు ఒక రశీదు ఇచ్చి, మిగిలిన రశీదులు బ్యాంకుకు సమర్పించ లేదు. రైతుకు అప్పునకు సంబంధించి రశీదుతో పాటు ఆ రుణానికి సంబంధించిన వివరాల నమోదుకు అప్పటి సీఈఓ చెల్లుచీటీ ఇచ్చినట్టు సమాచారం. రుణం తీరిపోయిందని రైతులు భావించారు. వాస్తవానికి రైతు చెల్లించిన డబ్బులు బ్యాంకుకు జమచేయలేదు. దీంతో రైతు రుణం చెల్లించనట్టుగా సంస్థ లెక్కలలో ఉంది.
రెండు రశీదు పుస్తకాలు మాయం
సంస్థ జారీ చేసిన రెండు రశీదు పుస్తకాలు మాయమయ్యాయి. ఆ రెండు రశీదు పుస్తకా లతో రైతులతో అప్పటి సీఈఓ ఆర్థిక లావాదేవీలు నెరిపినట్టు అధికారులు గుర్తించారు. రశీదు పుస్తకాల నంబర్లు 112500 నుంచి 112550 వరకు, 112651 నుంచి 112700 వరకు రశీదుల లావాదేవీలు పీఏసీఎస్‌లో లేవు.
సొసైటీలో సభ్యత్వం తీసుకొన్న రైతులందరికీ నోటీసులు జారీ చేస్తాం. ఇంత వరకు 181 మంది రైతులకు నోటీసులు జారీచేయగా 60 మందిని విచారణ చేపట్టాం. రెండు రశీదు పుస్తకాలు కార్యాలయంలో కనిపించడం లేదు. ఆ రెండు రశీదు పుస్తకాలద్వారానే రైతుల రుణానికి సంబంధించి రశీదులను జారీచేశారు. నోటీసులు రాకపోయినా సభ్యత్వం ఉన్న రైతులు వచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి.
– ఆర్.రమణమూర్తి, డీసీఓ, పార్వతీపురం

రైతులకు రూ.85 లక్షల టోకరా!

రైతులకు రూ.85 లక్షల టోకరా!