
252 పాఠశాలలు అభివృద్ధికి చర్యలు
రామభద్రపురం: జిల్లా వ్యాప్తంగా నాడు–నేడు కింద 252 పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఎస్‌ఏ జిల్లా కో ఆర్డినేటర్ ఎ. రామారావు తెలిపారు. మండలంలోని బూసాయవలస కేజీబీవీ పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. బాలికలకు నాణ్యమైన విద్యనందించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు కృషి చేయాలని టీచర్లకు సూచించారు. బాధ్యతగా పనిచేయాలని ఎంఆర్టీలను ఆదేశించారు. మండలానికి 4 నుంచి 5 పాఠశాలలు మరీ అధ్వానంగా ఉన్నాయని, వాటిని తొలుత బాగుచేస్తామన్నారు. పాఠశాలల నిర్వహణకు స్కూల్ గ్రాంటు కింద రూ.2.2 కోట్లు విడుదలైనట్టు వెల్లడించారు. కేజీబీవీల నిర్వహణకు ఒక్కో విద్యాలయానికి రూ.2 లక్షల చొప్పున విడుదల చేస్తామని తెలిపారు. పీఎంశ్రీ కింద 40 పాఠశాలల్లో రూ.4.50 కోట్లతో ఆధునిక కెమిస్ట్రీ ల్యాబ్‌లు, లైబ్రరీలు, క్రీడా ప్రాంగణాలు నిర్మిస్తున్నామని చెప్పారు. కేజీబీవీల్లో షటిల్ బ్యాడ్మింటన్, టెన్నీకాయిట్, వాలీబాల్, క్యారమ్స్ క్రీడలను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 10వ తరగతిలో ఉత్తీర్ణశాతం మరింత పెంచేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఈఈ ఎన్.హరిప్రసాద్, ప్రిన్సిపాల్ దీపిక, తదితరులు పాల్గొన్నారు.