
తూనికల్లో తేడాలొస్తే చర్యలు
రాజాం సిటీ: తూనికల్లో తేడాలొస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి, శ్రీకాకుళం లీగల్‌మెట్రాలజీ అధికారులు ఉమాసుందరి, బలరాంకృష్ణలు అన్నారు. ఈ మేరకు మంగళవారం రాజాంలో విస్తృతంగా దాడులు నిర్వహించారు. పండ్ల దుకాణాలు, వ్యాపార సంస్థల్లో వినియోగిస్తున్న కాటాలను పరిశీలించారు. ఈ సందర్భంగా 300 నుంచి 400 గ్రాముల వరకు తూకంలో తేడాలు గుర్తించారు. మొత్తం 40 మందిపై కేసులు నమోదుచేయడంతో పాటు కాటాలను, సీల్ లేని ఇనుపగుండ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తూనికల్లో తేడాలు లేకుండా విక్రయాలు జరపాలని, అలాగే ఎంఆర్‌పీ కంటే అధికంగా విక్రయాలు చేపట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎక్కువగా పండ్ల దుకాణాల్లో మోసాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, మరోసారి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.