
ఇద్దరు మైనర్ల ఫేక్ బాంబ్ కాల్..!
● స్టేషన్‌కు పిలిపించి మందలించిన సీఐ
విజయనగరం క్రైమ్: చదువుకుంటున్న ఇద్దరు మైనర్లు ఫేక్ బాంబ్ కాల్ చేసి అటు స్కూల్ యజమాన్యాన్ని, ఇటు పోలీసులను పరుగులు పెట్టించారు. దీనిపై టుటౌన్ సీఐ శ్రీనివాసరావు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల, భోగాపురానికి చెందిన మైనర్‌ల అత్త విజయనగరంలోని డబుల్ కాలనీలో ఉన్న కేజీబీవీలో పనిచేస్తోంది. ఈ మైనర్లు రెండు రోజుల క్రితం ఫంక్షన్‌కు వెళ్లిన సమయంలో తమ అత్త ఇంకా రాలేదన్న అక్కసుతో ఫేక్‌బాంబ్ కాల్ నాటకా నికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం 5 గంటలకు కేజీబీవీకి ఫోన్ చేసి బాంబ్ ఉందని చెప్పి ఫోన్ కట్ చేశారు. స్కూల్ నుంచి సమాచారం అందుకున్న టుటౌన్ సీఐ తన సిబ్బందితో హుటాహుటిన ఆరోజు రాత్రే కేజీబీవీకి వెళ్లి అణువణువూ గాలించారు. సీఐ శ్రీనివాస్ ఫోన్ నంబర్లను వెరిఫై చేయగా నెల్లిమర్ల లోకేషన్ చూపించడంతో క్రైమ్ పార్టీతో వెళ్లి ఇద్దరు మైనర్లను పట్టుకుని విచారణ చేయగా అది ఫేక్ కాల్ అని తెలింది. మైనర్ల తండ్రులు ఆర్టీసీలో ఒకరు, సెక్యూరిటీగా మరొకరు పనిచేస్తున్నారు. పోలీసులనే హడలెత్తించిన మైనర్లను సీఐ శ్రీనివాస్ మంగళవారం స్టేషన్‌కు పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలోనే సున్నితంగా హెచ్చరించారు. జైలు జీవితం వద్దని, ఇటువంటి ఫేక్ కాల్స్ ఆలోచన రావొద్దని చెబుతూ జీడీలో ఇద్దరి పేర్లను రాయించి ఇంటికి పంపించారు. ఈ విషయమై సీఐ మాట్లాడుతూ పిల్లలు ఏం చేస్తున్నారో కన్నవారు నిరంతరం కనిపెడుతూ ఉండాలన్నారు. కాలేజీ స్టూడెంట్స్ భవిష్యత్తు దృష్ట్యా కన్నవారిని పిలిచి మందలించామని సీఐ తెలిపారు.