
నేటి నుంచి సిమ్స్ బాప్టిస్ట్ చర్చి 150 వసంతాల వేడుకలు
● సంఘమిత్ర డాక్టర్ ఆర్‌ఎస్.జాన్
విజయనగరం టౌన్: మత సామరస్యానికి నెలవైన విజయనగరంలో అతిపెద్ద క్రైస్తవ సమాజంగా పేరుపొందిన సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి 150 వసంతాల వేడుకలను ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు సిమ్స్ చర్చి సంఘమిత్ర డాక్టర్ ఆర్‌ఎస్.జాన్ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం సిమ్స్ చర్చిలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 150 వసంతాల చారిత్రక నేపథ్యం కలిగిన విజయనగరం సిమ్స్ చర్చి కెనడా మేరీ టైమ్ బాప్టిస్ట్ మహాసభకు చెందిన డాక్టర్ సేన్ ఫోర్ట్ భీమిలి నుంచి ఇక్కడికి వచ్చి 1875 నవంబర్‌లో ఇక్కడ సంఘాన్ని స్థాపించి యాభై ఏళ్ల పాటు క్రైస్తవ ఆధ్యాత్మిక సేవలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. తర్వాత కాలంలో దీనికి సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిగా నామకరణం చేసినట్లు తెలిపారు. అలా సిమ్స్ స్థాపితమై నేటికి 150 వసంతాలు పూర్తిచేసుకుని, 151 వ వసంతంలోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవాలను విజయనగరం క్రైస్తవ సమాజానికి తలమానికంగా అత్యంత ఘనంగా నిర్వహించ తలపెట్టామని, అందులో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ వేడుకలు ప్రారంభిస్తారన్నారు. ఈ నెల 14వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ఐదు రోజుల పాటు విజయనగరంలో క్రైస్తవ మహాసభలు నిర్వహిస్తామన్నారు. క్రైస్తవమహాసభలకు ప్రముఖ దైవజనులైన రాజమండ్రి జాన్ వెస్లీ, మదనపల్లి రాజశేఖర్, పలమనేరు వేద నాయకం, బెంగుళూరు బెన్నీ ప్రసాద్, తిరుపతి హేమలత ప్రభ, హైదరాబాద్ వడ్డే నవీన్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో సౌత్ ఇండియా యూత్ కన్వెన్షన్ పేరుతో బైబిల్ రిఫరెన్స్, బైబిల్ క్విజ్, గ్రూప్ సింగింగ్ వంటి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. దైవజనులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.