
మాదక ద్రవ్యాల నియంత్రణకు ‘సంకల్ప రథం’తో ప్రచారం
విజయనగరం క్రైమ్: మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను యువతకు వివరించి, వారిని ఆ అలవాటుకు దూరం చేసేందుకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు ’సంకల్ప రథం’తో ప్రచారం చేపడుతున్నామని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం తెలిపారు. యువతతో పాటు డ్రగ్స్ అలవాటు ఉన్న వ్యక్తులు, ప్రజలకు ఈ ‘సంకల్పం’ కార్యక్రమాన్ని మరింత చేరువ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా రథాన్ని ప్రారంభించామన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా ’సంకల్ప రథం’ రూపొందించామన్నారు. ప్రతిరోజూ ఒక మండలాన్ని సందర్శించి, స్థానిక పోలీస్‌స్టేషన్ అధికారి, సిబ్బంది సహకారంతో ఉదయం కళాశాలల్లో వాహనాన్ని నిలిపి, విద్యార్ధులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నామన్నారు. అదే విధంగా సాయంత్రం సమయాల్లో మండలంలోని ముఖ్య ప్రాంతం లేదా కూడలిలో వాహనాన్ని నిలిపి, ప్రజలు, యువతకు మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారిలో చైతన్యం కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా ’సంకల్ప రధం’తో అవగాహన కార్యక్రమాలు పూర్తి చేశామన్నారు. మూడో విడతగా ప్రచార కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి ఆగస్టు 16 వరకు నిర్వహించినట్లు తెలిపారు. కొత్తగా ఒక షెడ్యూల్‌ను రూపొందించి ఆ ప్రకారం స్థానిక పోలీస్‌అధికారులు, సిబ్బంది ప్రతిరోజూ ఒక మండలంలోని ఒక కళాశాల, ముఖ్య కూడలిలో వాహనాన్ని నిలిపి, మాదక ద్రవాలవల్ల కలిగే దుష్ప్రభావాలపై వీడియోలు ప్రదర్శించి, వివరించామని ఎస్పీ తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాలను సంకల్ప రథం సందర్శించే విధంగా షెడ్యూల్ రూపొందించామని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.