
మృతుల స్వగ్రామాల్లో విషాదఛాయలు
జామి: మండలంలోని అలమండ గ్రామం సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరికిపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు బోని సాగర్, గుల్లిపల్లి సురేష్ అక్కడికక్కడే మృతిచెందారు. భీమాళి గ్రామానికి చెందిన మిడతాన సూర్యప్రకాష్ విజయనగరం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ సోమవారం మృతిచెందాడు. గ్రామానికి చెందిన గణేష్, సత్యవతి దంపతుల కుమారుడు సూర్యప్రకాష్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. ముగ్గురు యువకులు, చేతికి అందివచ్చిన తరుణంలో మృత్యువాత పడడంతో మృతుల గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
వ్యక్తిపై కేసు నమోదు
సంతకవిటి: మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన కంఠ రామలక్ష్మిని అదే గ్రామానికి చెందిన టొంపల రాజు మానసికంగా వేధిస్తున్నాడని బాధితురాలు సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం రామలక్ష్మి భర్త జీవనోపాధి నిమిత్తం విజయవాడ తరచూ వెళ్తుంటాడు. భర్త లేని సమయంలో రాజు ఆమెను మానసికంగా వేధిస్తుండగా భర్త ఇంటికి రావడంతో ఆమె ఈ విషయం తెలపడంతో సోమవారం స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చెప్పారు.