రామరాజ్యం స్థానంలో రాక్షస రాజ్యం | - | Sakshi
Sakshi News home page

రామరాజ్యం స్థానంలో రాక్షస రాజ్యం

Sep 9 2025 6:47 AM | Updated on Sep 9 2025 6:47 AM

రామరాజ్యం స్థానంలో రాక్షస రాజ్యం

రామరాజ్యం స్థానంలో రాక్షస రాజ్యం

పడిగాపులే...

ఇదీ లెక్క..

సాక్షి ప్రతినిధి, విజయనగరం:

రాష్ట్ర ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు అర్థం అవుతున్నాయి. ఆ నదిలో దిగి స్నానం చేసి రాగానే బంగారు కడియం ఇస్తానని చెప్పిన పులి.. బాటసారిని ఊబిలో చిక్కుకునేలా చేసి కబళించిన పులి కథ ప్రజలకు యాదికొస్తోంది. గుప్పెడు గింజల కోసం ఆశపడిన పావురాళ్లు వేటగాని వలలో చిక్కుకున్న కథ కూడా గుర్తొస్తోంది. ఎండు చేప ముక్క ఆశపడి బోనులో చిక్కుకున్న ఎలక పరిస్థితి మాదిరిగా మారింది ఏపీలో అన్నదాత పరిస్థితి. మీకెందుకు.. అన్నీ చేస్తాను.. అన్నీ ఇస్తాను అని ఎన్నికల ముందు చెప్పిన చంద్రబాబు మాటలు పంచదార పైన పూతపోసిన విషగుళికలు అని ఇప్పుడే అర్థమవుతోంది. పాడియావును కాళ్లదన్నుకుని నిజంగా కాళ్లతో తన్నే ఎద్దును తెచ్చుకుని ఇప్పుడు బాధపడితే ఏమిలాభం.. వైఎస్‌ జగన్‌ ఉన్న రోజుల్లో ఇంట్లో బిడ్డలకు అందరికీ సరిపోయేలా తల్లి అన్నం వండినట్లు.. అందరికీ సరిపోయేలా ఫలహారం సిద్ధం చేసినట్లు.. ఒక్కో ఊరికి ఎంత ఎరువు అవసరం అనేది లెక్కేసి గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాలకు సరఫరా చేసేది. రైతులు అలా వీధి చివరకు వెళ్లి ఎరువులు తెచ్చుకునేవారు. పోటీలేదు.. పోరాటం ఆరాటం అసలే లేదు. ఎవరో ఎత్తుకుపోతారన్న బెంగలేదు. అందరికీ సమృద్ధిగా ఎరువులు అందేవి. ఉన్న ఊళ్లోనే అన్ని సేవలు.. సౌకర్యాలు ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. రైతుకు పట్టంగట్టిన వైఎస్‌ జగన్‌ పాలన స్థానంలో రైతులు అంటే అసహ్యించుకునే కూటమి పాలన వచ్చింది. ఇక కష్టాలు మొదలయ్యాయి. పంటపండితే గిట్టుబాటు ధర దక్కదు. పంటలు వేద్దామంటే ఎరువులు దొరకవు. మారుతల్లి బిడ్డకు గిన్నె నిండా గంజిపోసి.. అందులో గుప్పెడు మెతుకులు విదిలించినట్లుగా ఎరువుల సరఫరా జరుగుతోంది. దీనికోసం రైతుల కొట్లాట.. కాట్లాడా.. గంటలతరబడి సొసైటీలు, ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద క్యూ లైన్లు.. తోపులాట.. తన్నులాట.. ఒక్క బస్తా ఎరువు దక్కితే ఏనుగు ఎక్కినంత సంబరం. అమ్మా... నాన్న ఏడమ్మా రోజంతా కనిపించలేదని అడిగే బిడ్డకు నాన్న ఎరువుల కోసం క్యూలో ఉన్నాడని చెప్పాల్సిన పరిస్థితి ఆ తల్లిది. వచ్చిన ఎరువుల్లో సింహభాగం టీడీపీ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయి బ్లాకులో అమ్ముతున్నారు. ఇక్కడ లైన్లో చెమటలుగక్కే రైతన్నలు మళ్లీ పరుగుపరుగున టీడీపీ వారి దుకాణాలకు వెళ్లి అధికధరకు కొనుక్కోవాల్సిన దుస్థితి. జై కిసాన్‌ నినాదం ఆంధ్రాలో అపహాస్యం పాలవుతోంది. పాలకులకు బాధ్యత లేదు.. కానీ ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆ బాధ్యతను భుజాన వేసుకుంది. రైతుల దుస్థితిని గుర్తించిన పార్టీ అధినేత వారికి బాసటగా ఉందామని నిర్ణయించుకున్నారు.

అడుగడుగునా దగాపడుతున్న రైతన్న

ఎరువుకోసం అగచాట్లు

బస్తా యూరియా కోసం రోజంతా

నిరీక్షించినా లభించని వైనం

నేడు అన్నదాతపోరు పేరిట ప్రభుత్వాన్ని నిలదీయనున్న రైతన్న

జిల్లాలోని మూడు ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు

చీపురుపల్లిలో పాల్గొననున్న

శాసనమండలి విపక్షనేత

బొత్స సత్యనారాయణ

అందరికీ అన్నంపెట్టే రైతన్నకు కష్టకాలం దాపురించింది. పొలంపని మానుకుని ఎరువు కోసం అగచాట్లు పడుతున్నాడు. ఒక బస్తా ఎరువు కోసం మండే ఎండలో.. పస్తులతో రోజంతా పడిగాపులు కాస్తున్నాడు. ఓ చోట టోకెన్ల పంపిణీ, మరో చోట ఎరువుబస్తా కోసం చాంతాడంత లైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి. అప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని దుస్థితి. జిల్లాకు వచ్చిన ఎరువును కూటమి నేతలు ముందుగానే బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి విక్రయించడంతో రైతన్నకు ఈ గడ్డు పరిస్థితి ఎదురైందంటూ గగ్గోలుపెడుతున్నారు. దీనిపై జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల వద్ద మంగళవారం వైఎస్సార్‌సీపీ తలపెట్టిన పోరుబాటలో పాల్గొనేందుకు పెద్దఎత్తున సమాయత్తమవుతున్నారు. కూటమి ప్రభుత్వ రైతువ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యుక్తులవుతున్నారు.

నేడు ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసనలు

నేడు (మంగళవారం–సెప్టెంబర్‌ 9)న జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల వద్ద రైతులతో కలిసి ఆందోళనలకు వైఎస్సార్‌ సీపీ సిద్ధమవుతోంది. ‘ఎరువుల బ్లాక్‌ మార్కెట్‌పై అన్నదాత పోరు’ పేరిట చేపడుతున్న కార్యక్రమంలో ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టి రైతులకు ఎరువులు అందేవరకు పోరాటం సాగిస్తామని కూటమి నేతల వెన్నుతట్టనుంది. బొబ్బిలి, చీపురుపల్లి, విజయనగరం రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాల వద్ద వేలాదిగా తరలివచ్చే రైతులతో కలిసి ఉద్యమం చేపట్టనుంది. పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఎంపీపీలు, అన్ని స్థాయిల్లోని కార్యకర్తలు ఈ ఉద్యమంలో పాల్గొని రైతుపక్షాన నిలబడి ప్రభుత్వం కళ్లు తెరిపించనున్నారు. చీపురుపల్లిలో జరగనున్న కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు.

యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. కొన్ని రైతు సేవా కేంద్రాలకు పూర్తిస్థాయిలో యూరియా రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ప్రైవేటు దుకాణాల వద్ద బస్తా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకని పరిస్థితి. పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందజేయకుండా కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని, రైతు ఉసురు తప్పక తగులుతుందంటూ శాపనార్థాలు పెడుతున్నారు. కొందరు రైతులు పొరుగు జిల్లాలోని పద్మనాభం, ఆనందపురం, భీమునిపట్నం తదితర మండలాలకు వెళ్లి రూ.267లు విలువున్న యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.400కు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు రైతులు గత్యంతరం లేక రూ.1700 విలువైన కాంప్లెక్స్‌ ఎరువు బస్తాను పంటకు జల్లుతున్నారు. పెట్టుబడి తడిసిమోపెడవుతోందంటూ ఆవేదన చెందుతున్నారు.

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాకు 40,111 మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించారు. ఈ నెల 6వ తేదీవరకు 26,849 మెట్రిక్‌ టన్నుల యూరియా జిల్లాకు వచ్చింది. ఇందులో 26,387 మెట్రిక్‌ టన్నుల యూరియా విక్రయించారు. 462 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉంది. రైతు సేవా కేంద్రాల వద్ద 227.9 మెట్రిక్‌ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 206 మెట్రిక్‌ టన్నులు, డీసీఎంఎస్‌ వద్ద 22 మెట్రిక్‌ టన్నులు, పీఏసీఎస్‌ల వద్ద 6 టన్నులు ఉంది. నిల్వలు అరకొరగా ఉండడం, అవసరం ఎక్కువగా ఉండడంతో రైతులకు యూరియా దొరకడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement