
భయపెడుతున్న నిమోనియా..!
● జిల్లాలో పెరుగుతున్న కేసులు
● ఇటీవల జిల్లాకు చెందిన ఇద్దరి మృతి
● నెలకు 400 నుంచి 500 వరకు కేసుల నమోదు
విజయనగరంఫోర్ట్: గంట్యాడ మండలానికి చెందిన 12 ఏళ్ల బాలుడుకి దగ్గు, ఆయాసం, జ్వరం రావడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్య పరీక్షలు, ఎక్స్‌రే, స్కానింగ్ తీసిన తర్వాత నిమోనియాగా గుర్తించారు. అక్కడ మూడు రోజులపాటు చికిత్స పొందుతూ మృతిచెందాడు.
● ఇదే మండలానికి చెందిన లక్ష్మి అనే మహిళకు దగ్గు, ఆయాసంతో పాటు చాతి నొప్పి, జ్వరం రావడంతో విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపించగా అక్కడ వైద్య పరీక్షలు, ఎక్సరే, స్కానింగ్‌లో నిమోనియాగా గుర్తించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ మహిళ మృతి చెందింది.
వీరిద్దరే కాదు. జిల్లాలో అనేక మంది నిమోనియా వ్యాధి బారిన పడుతున్నారు. చల్లటి వాతావరణంలో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోంది. నెలకు 400 నుంచి 500 వరకు నిమోనియా కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి పట్ల అలసత్వం వహిస్తే మృత్యువాతపడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సకాలంలో చికిత్స చేయించుకోవాలని చెబుతున్నారు. నిమోనియా, ఆస్తమా ఉన్న వారు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకోవాలి. కాలుష్యం ఉండే ప్రాంతాల్లో తిరగకూడదు. త్వరగా నిద్రపోవాలి. మధుమేహవ్యాధిని నియంత్రణలో ఉంచుకోవాలి. కూరగాయలు, పండ్లు, పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు ప్రతిరోజు తీసుకోవాలి. స్వీట్స్, మైదా, గోధమలు, అన్నం తక్కువగా తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అలసత్వం వద్దు
నిమోనియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వ్యాధి పట్ల అలసత్వం వహించరాదు. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకే ప్రమాదం. సకాలంలో చికిత్స చేయించుకోవాలి. మద్యం, పొగ తాగడం మానివేయాలి. చిన్న పిల్లలకు నియోనియా రాకుండా వ్యాక్సిన్ వేస్తారు. పెద్దవాళ్లు కూడా నియోనియాకు వ్యాక్సిన్ వేయించుకోవాలి. న్యూమోకోలర్, ఇన్‌ఫ్లూయంజా వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. – డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,
పలమనాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

భయపెడుతున్న నిమోనియా..!