
సుజల స్రవంతి భూ సేకరణ వేగవంతం చేయండి
విజయనగరం అర్బన్: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు భూ సేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు భూ సేకరణపై తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.కోట, వేపాడ, కొత్తవలస మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో 108 ఎకరాలు, బొండపల్లి మండలంలోని 3 గ్రామాల పరిధిలో 126 ఎకరాల భూసేకరణపై చర్చించారు. ఈ గ్రామాల రైతులతో త్వరలో సమావేశం నిర్వహించి ధర ఖారారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో భూసేకరణ విభాగం ప్రత్యేక ఉప కలెక్టర్ ఎం.ఎస్.కళావతి, సుజల స్రవంతి ఈఈ ఎ.ఉమేష్‌కుమార్, ఆయా భూసేకరణ విభాగాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డయల్ యువర్ కలెక్టర్‌కు 19 కాల్స్
సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్‌కు 19 కాల్స్ వచ్చాయి. ప్రధానంగా రెండో విడత యూరియా సరఫరా పైనే కాల్స్ ఎక్కువగా వచ్చాయి. కలెక్టర్ అంబేడ్కర్ స్వయంగా కాలర్స్‌తో మాట్లాడి వారి సమస్యలను విన్నారు. యూరియా సక్రమంగా సరఫరా అయ్యేలా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సమాధానం చెప్పారు.