
15 నుంచి జిల్లాలో యూటీఎఫ్ రణభేరి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి చేయాలని, ఒత్తిడి లేకుండా పని చేసే వాతావరణం కల్పించాలన్న డిమాండ్‌తో రణభేరి కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టాలని యూటీఎఫ్ జిల్లా కమిటీ ప్రకటించింది. స్థానిక జిల్లా పరిషత్ మినిస్టీరియల్ సిబ్బంది సమావేశ మందిరంలో ఆదివారం నిర్వహించిన సంఘం మధ్యంతర కౌన్సిల్‌లో ఈ మేరకు పేర్కొన్నారు. తొలిత రణభేరి షెడ్యూల్ ప్రచార పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఉమ్మడి సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోహన్లు కల్పించాలని, 12వ పీఆర్‌సీ కమిషన్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. రణభేరి కార్యక్రమంలో భాగంగా 3వ రోజున 100 బైక్‌లతో బొబ్బిలి, రామభద్రపురం, గజపతినగరం, విజయనగరం, గంట్యాడ మీదుగా ఎస్.కోట వరకు బైక్ ర్యాలీ కొనసాగుతుందని ప్రకటించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25న విజయవాడలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో బయలుదేరాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు జేఆర్‌సీపట్నాయక్, గౌరవాధ్యక్షులు మీసాల అప్పలనాయుడు, రాష్ట్ర నాయకులు డి. రాము, కె.విజయగౌరి తదితరులు పాల్గొన్నారు.