
వీఓఏలకు కాలపరిమితి రద్దు చేయాలి
పార్వతీపురం టౌన్: వెలుగు వీవోఏ లకు మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కిల్ రద్దు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్‌ఆర్ పాలసీ ప్రకటించాలని వీవోఏల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో వీవోఏల జిల్లా మహాసభ కె.కుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీవోఏల 3 సంవత్సరాల కాల పరిమితి సర్కిల్ రద్దు చేయాలని కోరారు. మెప్మాలో ఈ సర్క్యులర్‌ను రద్దు చేశారు అదే రకంగా వెలుగు సెల్ఫ్‌లో కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, రకరకాల పనులు ఇవ్వడం ద్వారా ఐకేపీ వీవోఏ పని భారం పెరుగుతోందన్నారు. పలు యాప్‌లు లాగిన్ చేయడం ద్వారా వీవోఏలు అనారోగ్యం పాలవుతున్నారని, రాజకీయంగా వేధిస్తూ జిల్లాలో 19 మంది వీవోఏలను తొలగించడం అన్యాయమన్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగడం లేదని విమర్శించారు. ఇస్తున్న వేతనాలు ఆరు, మూడు నెలలకు ఒకసారి చెల్లించడం దారుణమైన విషయమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా తొలగింపులు, వేధింపుల నుంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. వీవోఏల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా వీవోఏలు ఐక్యమై ఉద్యమించాలని కోరారు.
నూతన కార్యవర్గం ఎన్నిక
జిల్లాలోని 15 మండలాల నుంచి హాజరైన వీవోఏల సంఘం నూతన జిల్లా అధ్యక్షరాలిగా కె. శ్రీదేవి, ప్రధాన కార్యదర్శిగా కె.ధర్మరాజు, కోశాధికారిగా కె.కుమారి. సహ కార్యదర్శులుగా సుందరరావు, దేవి, ఉపాధ్యక్షుడిగా డి.అరుణ విజయ్ కుమార్‌లను మరో ఏడుగురు సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు వి రామలక్ష్మి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, జిల్లా కోశాధికారి గొర్లె వెంకటరమణ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు ఇందిర తదితరులు పాల్గొన్నారు.