
వ్యాన్ బోల్తా: డ్రైవర్‌కు గాయాలు
వేపాడ: మండలకేంద్రం వేపాడ సమీపంలో కళ్లాల్లో పంచదారతో వెళ్తున్న వ్యాన్ శనివారం బోల్తా పడడంతో డ్రైవర్ గాయాలపాలయ్యాడు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోడవరం నుంచి ఆనందపురం వేపాడ మీదుగా ఎస్.కోటకు పంచదారతో వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి వేపాడ కళ్లాలవద్ద రోడ్డుపై బోల్తాపడింది. దీంతో డ్రైవర్ కృష్ణకు గాయాలు కాగా స్థానిక పీహెచ్‌సీలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి హెచ్‌సి శేషాద్రి, కానిస్టేబుల్ కిషోర్ 108 వాహానంలో తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
డెంగీతో వివాహిత మృతి
భోగాపురం: మండలంలోని చిన కవులవాడ (యాతపేట) గ్రామానికి చెందిన వివాహిత మైనపు మంగ (28) డెంగీ వ్యాధి సోకి శనివారం మధ్యాహ్నం మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. రెండు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మంగను కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి డెంగీ వ్యాధి సోకి మెదడుకు వ్యాపించిదని నిర్థారించారు. ఇంతలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంగ పిచ్చి పిచ్చి పేలాపనలు, వాగడం మొదలు పెట్టింది. దీంతో వ్యాధి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో కొన్ని రోజులు ఉంచి వైద్యం అందించాలని వెద్యులు సూచించినప్పటికీ కుటంబసభ్యులు వినకుండా ఆమెకు దెయ్యం పట్టిందనే అనుమానంతో ఇంటికి తీసుకువచ్చేశారు. దీంతో ఆమెకు వైద్యం అందక చనిపోయింది. మృతురాలికి భర్త నరసింహులుతో పాటు ఇద్దరు కూమార్తెలు ఉన్నారు.
గూడ్స్ ఢీకొని వ్యక్తి మృతి
లక్కవరపుకోట: మండలంలోని సంతపేట గ్రామం సమీపంలో కొత్తవలస–కిరండోల్ (కేకే లైన్) రైల్వే ట్రాక్ దాటుతుండగా మార్లాపల్లి గ్రామానికి చెందిన గేదెల దేముడుబాబు (48) గూడ్స్ ఢీకొట్టడంతో శనివారం మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేముడుబాబు సంతపేట గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నసమారాధనకు రైల్వే ట్రాక్ దాటి వెళ్తుండగా కిరండోల్ నుంచి విశాఖ వెళ్తున్న గూడ్స్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో రెండు కాళ్లు తెగిపడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించి కొన ఊపిరితో ఉన్న దేముడుబాబును ఎస్‌కోట సీహెచ్‌సీకి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసునమోదు చేశారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
బొబ్బిలి: రాష్ట్రంలో యువత అందరికీ ఉద్యోగాలు కల్పిస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని పట్టించుకోకపోవడంతో యువత ఆత్మహత్యల బాట పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మండలంలోని కృష్ణాపురం గ్రామంలోని రైతు కూలీ కుటుంబానికి చెందిన బలగ మధు(23)అనే యువకుడు బొబ్బిలి సమీపంలోని గున్నతోటవలస సమీపంలోని రైలు కింద పడి శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై రైల్వే పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన బలగ శంకరరావుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మధుసూదన రావు ట్రిపుల్ ఐటీ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. చిన్న కుమారుడు ఐటీఐ చదువుతున్నాడు. మధు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రాకపోవడంతో తరచూ కలత చెందేవాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఉద్యోగం రాకపోతే పోయింది. మా శక్తి ఉన్నంత వరకూ పెంచుతాం. తరువాత ఎప్పుడైనా ఉద్యోగం రాకపోతుందా?మమ్మల్ని అప్పుడు పెంచుతావుకదా? ఇంత ఘోరానికి ఒడిగట్టావా నాయనా అంటూ తల్లి దండ్రులు మృత దేహంపై పడి రోదిస్తున్న తీరు స్థానికులను కలిచివేసింది. మధు మృతి వార్తతో కృష్ణాపురంలో విషాద ఛాయలు అముకున్నాయి. మృతదేహాన్ని బొబ్బిలి ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసులు పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు.